‘పుర’ పీఠాలపై ప్రధాన పార్టీల గురి..
మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు మున్సిపాలిటీలపై గురి పెడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా వరంగల్ ఉమ్మడి జిల్లాలో జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌తో పాటు ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్, కేసముద్రం మున్సిపాలిటీలకు ఈసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో 9 మున్సిపాలిటీల్లో 2,50,687 మంది ఓటర్లు ఉండగా, 1,23,802 పురుషులు, 1,26,885 మహిళా ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి ఓటర్ల సవరణలో భాగంగా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపాలిటీల్లోని 54 వార్డుల్లో 35 వేల వరకు ఓటర్లున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే నాటికి మున్సిపాలిటీల ఓటర్లపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి.


