క్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం
క్రిస్మస్ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ
వరంగల్: యేసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి మార్గదర్శకమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ ఓసిటీలోని మంత్రి క్యాంపు కార్యాలయ ఆవరణలో మంగళవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్లతో కలిసి మంత్రి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. పాస్టర్లకు తన సొంత ఖర్చుతో దుస్తులు పంపిణీ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలు ప్రేమ, దయ, కరుణకు చిహ్నంగా నిలుస్తాయని అన్నారు. వరంగల్ నగరంలోని చర్చిలకు రంగులు వేసేందుకు సీఎం నిధులు కేటాయించడం హర్షణీయమని మేయర్ సుధారాణి అన్నారు. మంత్రి ఆదేశం మేరకు నగరంలోని చర్చిలు ఉన్న ప్రాంతాల్లో కార్పొరేషన్ తరఫున శానిటేషన్, లైటింగ్‌కు రూ.10 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా స్టేజీపై ఎలాంటి పదవులు లేని కాంగ్రెస్ నాయకులు ఆసీనులు కావడంపై పలువురు చర్చించుకున్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనవు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, కార్పొరేటర్లు భోగి సువర్ణ, కావేటి కవిత, అనిల్‌కుమార్, పద్మ, రవి, సురేష్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


