కేఎంసీ ఆభివృద్ధికి కృషి
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ రమేశ్‌రెడ్డి
ఎంజీఎం: కాకతీయ వైద్య కళాశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి అన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన అవార్డులు, ప్రశంసపత్రాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రథమ, ద్వితీయ సంవత్సర ఎంబీబీఎస్ టాపర్లు, పీజీ యూనివర్సిటీ టాపర్లకు అవార్డులు, ప్రశంసపత్రాలు అందజేశారు. అలాగే, ఏఎంబీఐ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై న ప్రొఫెసర్ డాక్టర్ పుల్లయ్యను శాలువాతో సన్మానించారు. అనంతరం వీసీ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ కేఎంసీ (1979 బ్యాచ్) పూర్వ విద్యార్థిగా చదివిన తాను ఇప్పుడు ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉందని తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సూచనల మేరకు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అనంతరం వీసీని కళాశాల బృందం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతులు, అధ్యాపకులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.


