కేయూ పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా | - | Sakshi
Sakshi News home page

కేయూ పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

Dec 24 2025 3:46 AM | Updated on Dec 24 2025 3:46 AM

కేయూ

కేయూ పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

కేయూ పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా జడ్జి పట్టాభి రామారావుకు ఘనంగా వీడ్కోలు అంబులెన్స్‌లో ప్రసవం ఐఎల్‌పీఏ రాష్ట్ర కమిటీలో వరంగల్‌ న్యాయవాదులు వృత్తి నైపుణ్య పరీక్షలు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో జనవరి 3 నుంచి నిర్వహించాల్సిన పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌ మంగళవారం తెలిపారు. యూజీసీ నెట్‌, సెట్‌, టెట్‌ పరీక్షలు ఉన్నందున ఈ పరీక్షలు వాయిదావేశామని ఆయన పేర్కొన్నారు. సవరించిన పరీక్షల షెడ్యూల్‌ తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.

వరంగల్‌ లీగల్‌: నాంపల్లి సీబీఐ కోర్టుకు బదిలీపై వెళ్తున్న హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పట్టాభి రామారావుకు న్యాయవాదులు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పులి సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు వీడ్కోల సభలో జస్టిస్‌ పట్టాభి రామారావు మాట్లాడుతూ తాను 8 నెలలపాటు హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా చేసిన సేవలు సంతృప్తి కలిగించాయని అన్నారు. అదనంగా ఐదు కొత్త కోర్టులు, నూతన భవనంపై మరో అంతస్తు నిర్మాణానికి తన సారథ్యంలో హైకోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపారు. మంచి అనుభూతులతో బదిలీ అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. సమావేశంలో వరంగల్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నిర్మలాగీతాంబ, హన్మకొండ జిల్లా ఇన్‌చార్జ్‌ జడ్జి అపర్ణాదేవి, న్యాయమూర్తులు, వరంగల్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వలస సుధీర్‌, బార్‌ నాయకులు కొత్త రవి, అంబేడ్కర్‌, వెంకటేశ్‌, సాంబశివరావు, న్యాయవాదులు పాల్గొన్నారు.

హసన్‌పర్తి: అంబులెన్స్‌లో ఓ మహిళ మంగళవారం ప్రసవించింది. వివరాలిలా ఉన్నాయి. హసన్‌పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట ప్రాంతానికి చెందిన ఝాన్సీకి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌ సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స చేసే క్రమంలోనే ఝాన్సీకి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో సిబ్బంది స్వాతి, పైలట్‌ తిరుపతి అంబులెన్స్‌లోనే సాధారణ ప్రసవం చేశారు. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను హనుమకొండలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌ సిబ్బందికి ఝాన్సీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

వరంగల్‌ లీగల్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన ఇండియన్‌ లీగల్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ (ఐఎల్‌పీఏ) రాష్ట్ర కమిటీలో వరంగల్‌, హనుమకొండ జిల్లాల న్యాయవాదులకు చోటు దక్కింది. ఐఎల్‌పీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హనుమకొండ బార్‌కు చెందిన సాయిని నరేందర్‌, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా సీనియర్‌ న్యాయవాది చిల్లా రాజేంద్రప్రసాద్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరంగల్‌ బార్‌కు చెందిన సీనియర్‌ న్యాయవాది తీగల జీవన్‌గౌడ్‌ను ఎన్నుకున్నారు. అలాగే, రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక సభ్యులుగా జన్ను పద్మ, ఎగ్గడి సుందర్‌రామ్‌, పల్లె ప్రశాంత్‌, నర్సంపేట బార్‌కు చెందిన పండగ శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీకి ఎన్నికై న నాయకులకు హనుమకొండ, వరంగల్‌ బార్‌ అసోసియేషన్ల అధ్యక్షులు పులి సత్యనారాయణ, వలస సుధీర్‌, ఐఎల్‌పీఏ వరంగల్‌, హనుమకొండ జిల్లాల కన్వీనర్లు విలాసాగరం సురేందర్‌గౌడ్‌, ముచ్చు రాజేందర్‌, బార్‌ కన్వీనర్లు పెండ్యాల అనిల్‌కుమార్‌, పూసపల్లి శ్రీనివాస్‌, న్యాయవాదులు అంబరీషరావు, కె.నిర్మలాజ్యోతి, లడే రమేశ్‌, సిరిమల్ల అరుణ, శశిరేఖ తదితరులు అభినందనలు తెలిపారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో ట్రైనీలకు మంగళవారం పరీక్షలు నిర్వహించారు. పలు కోర్సుల్లో శిక్షణ పొందిన 86 మందికి 85 మంది హాజరైనట్లు యువజన సర్వీసుల శాఖ సూపరింటెండెంట్‌ వై.విజయశ్రీ తెలిపారు. హైదరాబాద్‌ సెట్విన్‌ అధికారి మాధవి పర్యవేక్షించారు.

కేయూ పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా1
1/1

కేయూ పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement