సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు, మనోభావాలు దెబ్బతినకుండా అనుకున్న సమయానికే మేడారం జాతర పనులు పూర్తి చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణ విస్తరణ పనులు 200 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా చేస్తున్నామని స్పష్టం చేశారు.
మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా ఎస్పీ సు«దీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రాలతో కలిసి మంత్రి పొంగులేటి మంగళవారం మేడారంలో సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణ విస్తరణ పనులను పరిశీలించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లతో పనుల పురోగతిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఆలయ ప్రాంగణ, రాత్రి నిర్మాణ పనులు, సివిల్ వర్క్స్, గద్దెల చుట్టూ గ్రిల్స్, ప్రాకారం బయటి వైపు సీసీ రోడ్ల పనులను ఈ నెల 31లోగా పూర్తి చేయాలని, ఇతర పనులను జనవరి 5లోగా ముగించాలని ఆదేశించారు. సెంట్రల్ లైటింగ్, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు, వాటర్ ట్యాంకుల నిర్మాణం తదితర పనులను అధికారులు విభజించుకొని గడువులోపు పూర్తి చేయాలన్నారు.
గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడే విధంగా గద్దెల ప్రాంతంలో పాలరాతి శిల్పాలతో పునరుద్ధరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల అస్తిత్వాన్ని కాపాడుతూ పనులను చేపట్టామని, పాలరాతి శిల్పాలపై గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రూపొందిస్తున్నామని, అమ్మవార్ల దయతో సకాలంలో పనులు సకాలంలో పూర్తవుతాయని అభిప్రాయపడ్డారు.
నేడు వనదేవతల దర్శనం నిలిపివేత
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మల దర్శనానికి భక్తుల రాకను బుధవారం నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రకటించారు. మంగళవారం మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయంలో ఈఓ వీరస్వామి, పూజారులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోవిందరాజు, పగిడిద్దరాజుల నూతన గద్దెలపై ధ్వజ స్తంభాల ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు నిర్వహించనున్న సందర్భంగా అమ్మవార్ల దర్శనాలను ఒకరోజు నిలిపివేస్తున్నట్లు చెప్పారు.
పూజాకార్యక్రమాలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గురువారం నుంచి యథావిధిగా అమ్మవార్లను భక్తులు దర్శించుకోవచ్చన్నారు. ఈ విషయంలో భక్తులు తమకు సహకరించి దర్శనాలను బుధవారం వాయిదా వేసుకోవాలని కోరారు.


