బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
నర్సంపేట: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రతీ అధికారి బాధ్యతతో, నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సత్యశారద సూచించారు. నర్సంపేట జెడ్పీ సెకండరీ స్కూల్‌లో పీఓ, ఏపీఓలకు శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణలో పారదర్శకత, సమర్థత ఎంతో కీలకమని, చిన్న పొరపాటు కూడా జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. శిక్షణ అనంతరం నర్సంపేట మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణకు వినియోగించే ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పీఎంశ్రీ జెడ్పీ సెకండరీ స్కూల్ పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణమే శుభ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
వర్ధన్నపేట: మున్సిపల్ ఎన్నికల విధులను పీఓ, ఏపీఓలు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సత్యశారద ఆదేశించారు. పట్టణంలోని రైతువేదికలో పీఓ, ఏపీఓలకు ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని గుర్తుచేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఇచ్చే ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్స్‌ల సీలింగ్, ప్రిసైడింగ్ అధికారుల డైరీ, బ్యాలెట్ పేపర్, అకౌంట్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్‌లు తెరవడం, పోలింగ్ ప్రక్రియ ప్రారంభం వంటి పలు అంశాలను వివరించారు. పోలింగ్ కేంద్రాల్లోకి వాటర్ బాటిళ్లు, బ్యాగ్‌లు, మొబైల్‌ఫోన్లు, ఇంక్‌ప్యాడ్ వంటివి అనుమతించవద్దని పేర్కొన్నారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, నర్సంపేట, వర్ధ న్నపేట మున్సిపల్ కమిషనర్లు భాస్కర్, సుధీర్‌కుమార్, తహసీల్దార్లు రవిచంద్రరెడ్డి, విజయసాగర్, ఎన్నికల అధికారులు, మున్సిపల్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, తదితరులు పాల్గొన్నారు.


