జూరాల వద్ద ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

జూరాల వద్ద ఉద్రిక్తత

Sep 23 2026 12:37 AM | Updated on Sep 23 2026 12:37 AM

ఆయకట్టు రైతులు అధైర్యపడొద్దు..

వనపర్తి: జూరాల ప్రాజెక్టు ఆయకట్టులో పంటలు సాగు చేసిన రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఒక్క ఎకరా పంట కూడా ఎండిపోకుండా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెల్లడించారు. ఈ విషయమై రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు లేఖరాసి తెలంగాణలోని జూరాల, భీమా, నెట్టెంపాడు, ఎంజీకేఎల్‌ఐ పథకాల పరిధిలోని పంటలు కాపాడేందుకు రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున 15 రోజుల పాటు కృష్ణా జలాలు విడుదల చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై కర్ణాటక సీఎంతో చర్చించేందుకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు గద్వాల, దేవరకద్ర ఎమ్మెల్యేలు, తాను వెళ్తున్నట్లు ప్రకటించారు. సాగునీటి సమస్య పరిష్కారానికి మరికొన్నిగంటల్లో శుభవార్త వస్తుందన్నారు.

అమరచింత: సాగునీటి కోసం రైతులు చేస్తున్న ఆందోళనతో మంగళవారం జూరాల జలాశయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆరు రోజులుగా జూరాల కాల్వలకు సాగునీరు నిలిపివేయడంతో పంటలు కాపాడుకునేందుకు ఆయకట్టు రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనలు చేస్తున్న విషయం విధితమే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మంగళవారం జూరాల ప్రాజెక్టు సందర్శనతో పాటు రైతులతో ముఖాముఖి నిర్వహించేందుకు వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పోలీసు బలగాలను మొహరించడమే కాకుండా జిల్లావ్యాప్తంగా బీజేపీ, సీపీఎం నాయకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. పోలీసుల కళ్లుగప్పి ప్రాజెక్టుకు చేరుకున్న ఆయా పార్టీల నాయకులను అడ్డుకొని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌ వాహనాల్లో కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తామని ఇరుపార్టీల నాయకులు చెప్పగా.. ఇక్కడ ఉండరాదని తక్షణమే ఖాళీ చేసి వెళ్లాలని పోలీసులు చెప్పడంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది.

సమాంతర కాల్వ వద్ద బీజేపీ..

రైతులకు సాగునీరు ఇవ్వాలంటూ బీజేపీ నాయకులు జూరాల సమాంతర కాల్వకు చేరుకున్నారు. నందిమళ్ల క్యాంపు రహదారి నుంచి వస్తారని బారికేడ్లు ఏర్పాటుచేసి పహారా కాస్తున్న పోలీసులకు సమాంతర కాల్వ వద్దకు బీజేపీ నాయకులు చేరుకున్నారనే సమాచారం అందటంతో హూటాహుటిన అక్కడికి చేరుకొని ప్రాజెక్టుపైకి రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. సాగునీరు వదలాలని కోరుతున్న రైతులపై ప్రభుత్వం పోలీసు బలగాలతో దాడులు చేయించడం దారుణమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రైతులు ఆగమయ్యారని, వ్యవసాయం అంటేనే భయపడే పరిస్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు వదిలే వరకు ఇక్కడి నుంచి కదలమని బైఠాయించడంతో పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య జరిగిన తోపులాటలో బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర నాయకుడు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి తలకు గాయమైంది. కార్యక్రమంలో బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, మేర్వ రాజు, మల్లారెడ్డి, లావణ్య, నారాయణ పాల్గొన్నారు.

పీజేపీ క్యాంపు వద్ద సీపీఎం..

సాగునీరు వెంటనే వదలాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా మంగళవారం ఆందోళన చేపట్టారు. తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ జూరాలకు రాకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం అడ్డుపడిందని.. భూత్పూర్‌ వద్ద అరెస్ట్‌ చేసి ఠాణకు తరలించడం ఏమిటని ప్రశ్నించారు. రైతు, ప్రజా ప్రభుత్వమని పత్రికా ప్రకటనలు ఇస్తున్న కాంగ్రెస్‌.. సాగునీరు ఇవ్వడంతో విఫలమైందని ఆరోపించారు. ఆయకట్టు రైతులకు కనీసం వారాబందీ విధానంలోనైనా సాగునీరు ఇవ్వాలని.. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని చెప్పడంతో పోలీసులు కలగజేసుకొని బలవంతంగా పోలీస్‌ వాహనంలో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆందోళనలో సీపీఎం నాయకులు బాల్‌రెడ్డి, జీఎస్‌ గోపి, వెంకటేష్‌, రమేష్‌, చిన్నకురుమూర్తి, చంటి తదితరులు పాల్గొన్నారు.

మొహరించిన పోలీసు బలగాలు..

జూరాల ప్రాజెక్టుకు మంగళవారం బీజేపీ రాష్ట్ర చీఫ్‌ రామచందర్‌రావు, సీపీఎం రాష్ట్రకార్యదర్శి జాన్‌వెస్లీ వస్తున్నారని తెలిసి ప్రాజెక్టు ఎడమ కాల్వ వద్ద భారీగా పోలీసు బలగాలను మొహరించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో కొత్తకోట, వనపర్తి, ఆత్మకూర్‌ సీఐలు, 10 మంది ఎస్‌ఐలతో పోలీసు పహారా కొనసాగించారు. కిష్టంపల్లి ఎక్స్‌రోడ్‌తో పాటు నందిమళ్ల క్యాంపు, జూరాల ప్రధాన ఎడమ, సమాంతరకాల్వ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలపై ఆంక్షలు విధించారు.

బీజేపీ, సీపీఎం నాయకుల ఆందోళనలు

సాగునీరు వదలాలంటూ తరలొచ్చిన అన్నదాతలు

భారీగా మొహరించిన పోలీసులు

ప్రాజెక్టు రహదారులన్నీ బారికేడ్లతో మూసివేత

నాయకుల అరెస్ట్‌.. కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement