పారదర్శక ఓటరు జాబితా లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పారదర్శక ఓటరు జాబితా లక్ష్యం

Sep 12 2026 12:48 AM | Updated on Sep 12 2026 12:48 AM

88,727 మంది ఓటర్లకు ‘సర్‌’ నోటీసులు

సరైన ఆధారాలు చూపిస్తే ఓటుహక్కు కల్పిస్తాం

జిల్లాలో 2.35 లక్షల ఓటర్లు

గ్రామాలకు వెళ్లి విచారణ.. ఆధారాల సేకరణలో సిబ్బంది

‘సాక్షి’ ఫోన్‌–ఇన్‌లో అదనపు కలెక్టర్‌ టి.వినోద్‌కుమార్‌

రెవెన్యూ

అదనపు కలెక్టర్‌

టి.వినోద్‌కుమార్‌

ప్రశ్న : కొత్త ఓటరు నమోదుకు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి? – నవీన్‌, గోపాల్‌పేట

అదనపు కలెక్టర్‌ : ఏడాదికి రెండు అంతకంటే ఎక్కువ సార్లు అర్హులకు ఓటు హక్కు కల్పించేందుకు సీఈఓ ఫారం–6 స్వీకరిస్తుంది. ఆ సమయంలో దరఖాస్తును తహసీల్దార్‌ కార్యాలయం ఎన్నికల విభాగంలోగాని, ఆన్‌లైన్‌లోగాని దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 12, 13 తేదీల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ఈ అవకాశాన్ని 18 ఏళ్లు నిండిన వారు ఉపయోగించుకోవాలి.

ప్రశ్న : వయసు 45 ఏళ్లు పైబడి ఉంటుంది. ఎక్కడా ఓటుహక్కు లేదు. ఓటరు నమోదుకు కోసం దరఖాస్తు చేసుకోవచ్చా? – రాములు, పాన్‌గల్‌

అదనపు కలెక్టర్‌ : వయస్సు ఎక్కువగా ఉండి ఓటరు నమోదుకు దరఖాస్తు చేసినట్లయితే.. సంబంధిత డాక్యుమెంట్లతో పాటు దేశంలో మరెక్కడా ఓటుహక్కు లేదని డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. భవిష్యత్‌లో సదరు వ్యక్తికి ఇతర ప్రాంతంలో ఓటుహక్కు ఉన్నట్లు నిర్థారణ అయితే భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం శిక్షార్హులవుతారు.

పేర్లు, వయసు, ఇంటిపేరులో వ్యత్యాలుంటే..

మునుపటి ఓటరు జాబితాలో ఒకలా.. ప్రస్తుత ఓటరు జాబితాలో మరోలా పేరు ఇద్దరూ ఒక్కరే అని ధ్రువీకరించేందుకు సీఈఓ జారీ చేసిన 11 రకాల ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకటి బీఎల్వోలకు సమర్పిస్తే అప్పటికప్పుడే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. 2026, నవంబర్‌ 9న చేసే తుది ఓటరు జాబితాలో వారికి ఓటుహక్కు కల్పించబడుతుంది.

ప్రశ్న : సర్‌ నోటీసులు జారీ చేయడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. గ్రామసభలు నిర్వహించి సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాదా..?

– అంజద్‌ అలీ, రామన్‌పాడ్‌, మదనాపురం

అదనపు కలెక్టర్‌ : పాత, ప్రస్తుత ముసాయిదా ఓటరు జాబితాలో పేరు, ఇంటిపేరు, వయస్సులో వ్యత్యాసాలుంటే నోటీసులు జారీ చేస్తున్నారు. రెండు జాబితాల్లో పేర్కొన్న వ్యక్తి ఒక్కరేనని నిర్ధారించేందుకు సీఈఓ నిర్దేశించిన ధ్రువపత్రాల్లో ఏదైన ఒకటి బీఎల్వోకు అందజేస్తే సమస్య వెంటనే పరిష్కారమవుతుంది. విచారణ అధికారులు గ్రామాలకు వచ్చి గ్రామసభలు నిర్వహిస్తూ అక్కడే సమస్యలను పరిష్కారం చేస్తున్నారు. వనపర్తి నియోజకవర్గంలోని పది మండలాల పరిధిలో ఉన్న పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని ఆవాస ప్రాంతాలకు 20 బృందాలను ఏర్పాటు చేశాం.

వనపర్తి: నోటీసులు వచ్చాయని ఓటర్లు ఆందోళన చెందాల్సిన పనిలేదు.. కేవలం వివరాలను సరిచేసేందుకు కావాల్సిన డాక్యుమెంట్లు సమర్పించాలనే నోటీసులు జారీ చేశాం.. ఓట్లు గల్లంతవుతాయనే అపోహలు వదిలేయండి.. సరైన ధ్రువపత్రాలు బీఎల్వోలకు సమర్పించి ఓటుహక్కు పొందాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ టి.వినోద్‌కుమార్‌ సూచించారు. ‘సర్‌’ ప్రక్రియపై ఓటర్లకు ఉన్న అపోహలు తొలగించి సందేహాలను నివృత్తి చేసేందుకు శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌–ఇన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని వివరాలు వెల్లడించటంతో పాటు పలువురు ఓటర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. జిల్లాలో ఎస్‌ఐఆర్‌కు ముందు 2.75 లక్షల ఓట్లు ఉండేవని.. ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించిన లెక్కల ప్రకారం పబ్లిష్‌ చేసిన ఓటరు జాబితాల్లో 2.35 లక్షలు ఉండగా, వారిలో 88,727 మందికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఇందులో నో మ్యాపింగ్‌ ఓటర్లు 12,087 మంది.. పేర్లు, ఇంటిపేర్లు, వయసు వ్యత్యాసాలు ఉన్న ఓటర్లు 76,640 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు.

నో మ్యాపింగ్‌ జాబితాలో ఉన్న వారు 1987కు ముందు జన్మించిన వారైతే స్థానికులనే ధ్రువపత్రం ఏదైనా ఒక్కటి సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు. 1987–2004 మధ్య కాలంలో జన్మించిన వారైతే తన ధ్రువపత్రంతో పాటు ఈ ప్రాంతంలో తన తండ్రి ఓటు వేసినట్లుగా ఓటరు జాబితాలో ఉన్న ఎపిక్‌ నంబర్‌, ఓటరు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ 2004 –2025 మధ్య కాలంలో జన్మించిన వారైతే వారి స్థానిక ధ్రువపత్రంతో పాటు కుటుంబ సభ్యుల్లో కనీసం ఇద్దరి ఓటర్లు జాబితాలోని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే సదరు వ్యక్తి ఓటుహక్కును బీఎల్వోలు జాబితాలో చేర్చేందుకు సిఫారస్‌ చేస్తూ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.

ప్రశ్న : కొన్ని ఇంటినంబర్లపై 20కి పైబడి ఓట్లు ఉండటం ఎలా సాధ్యం? – శ్రీనివాసులు, మదనాపురం

అదనపు కలెక్టర్‌ : అద్దెకు ఉన్న ఇళ్లలో ఎక్కువ ఓటర్లు ఉన్నట్లు గుర్తించాం. ఇందులో చాలావరకు ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించినప్పుడే తగ్గిపోయాయి. స్థానికంగా ఉంటున్నారు.. ఇదివరకు ఇక్కడి ఓటరు జాబితా ప్రకారం వారి కుటుంబ సభ్యులు ఓటుహక్కు వినియోగించుకున్నట్లుగా ఆధారాలు సమర్పించిన వారికే జాబితాలో పేర్లు నమోదవుతాయి.

ప్రశ్న : పెళ్లి చేసుకుని ఇతర రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి వచ్చిన వారు ఏ ధ్రువపత్రాలు సమర్పించాలి. – విజయ్‌కుమార్‌, పెబ్బేరు

అదనపు కలెక్టర్‌ : దేశంలో ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం నుంచి అయినా ఇక్కడికి పెళ్లి చేసుకుని వచ్చిన మహిళలైనా వారి తల్లిదండ్రుల ఓటుహక్కు ఎక్కడ ఉంటే అక్కడి వివరాలను ఓటరు జాబితా ఆధారంగా సేక రించి సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాల్సిందే. భర్త వివరాలను పేర్కొనాలనుకోవడం సరికాదు.

ప్రశ్న : మా అమ్మ ఇంటిపేరు లేకుండా ఓటరుగా నమోదు చేశారు. ఆమె చదువుకోలేదు. ఏ ధ్రువపత్రాలు సమర్పించాలి.

– నర్సింహ, గోపల్‌దిన్నె, వీపనగండ్ల

అదనపు కలెక్టర్‌ : పట్టాదారు పాసు పుస్తకం, ప్రభుత్వం జారీ చేసిన కుల ధ్రువీకరణపత్రం, పింఛన్‌కార్డు, ఆధార్‌కార్డు సమర్పిస్తే సరిపోతుంది. వారికి ఓటుహక్కు కల్పిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement