నేడు లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు లోక్‌ అదాలత్‌

Sep 12 2026 12:48 AM | Updated on Sep 12 2026 12:48 AM

వనపర్తిటౌన్‌: జిల్లాలోని కోర్టుల్లో శనివారం నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు ఒక ప్రకటనలో కోరారు. సివిల్‌, వివాహ సంబంధిత కేసులు, మోటారు ప్రమాద క్లెయిమ్స్‌, చెక్‌బౌన్స్‌ కేసులు, ఇతర రాజీ పడదగిన క్రిమినల్‌ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. లోక్‌ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకోవడంతో డబ్బు, సమయం ఆదా అవుతాయని.. ఏళ్లుగా పరిష్కారం కాని కేసులు పరిష్కరించుకోవచ్చని సూచించారు.

సమర్థవంతంగా ప్రజాపాలన దినోత్సవం

వనపర్తి: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను సెప్టెంబర్‌ 17న ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ టి.వినోద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టరేట్‌ ఆవరణలో వేడుకల నిర్వహణకు అవసరమైన వేదిక, కుర్చీలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు, ఆహ్వానితులు హాజరయ్యేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, అందరికీ ఆహ్వానాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమం జరిగే సమయంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, సీపీఓ హరికృష్ణ, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు.

కేంద్ర బృందం తనిఖీ

మదనాపురం: మండలంలో జల్‌ సంచయ్‌.. జల్‌ భాగీదారి పథకంలో భాగంగా చేపట్టిన నీటి నిల్వ పనులను శుక్రవారం కేంద్ర బృందం ప్రతినిధి అమన్‌సోన్‌ పరిశీలించారు. గతేడాది వివిధ గ్రామాల్లో నిర్మించిన ఫాంపాండ్స్‌, ఇంకుడుగుంతలు, గట్లపై తవ్విన ట్రెంచెస్‌ తదితర నీటి సంరక్షణ నిర్మాణాల వివరాలను అధికారులు ఆనన్‌లైన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు. అప్‌లోడ్‌ చేసిన వర్క్‌ఐడీల ఆధారంగా మండలంలోని అజ్జకొల్లు, తిరుమలాయపల్లి, రామన్‌న్‌పాడు, మదనాపురం, నెల్విడి, నర్సింగాపురం, కొన్నూరు, దుప్పల్లి, ద్వారకానగర్‌, గోపన్‌పేట్‌ గ్రామాల్లో పర్యటించిన బృందం 22 ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీచేసి నిర్మాణాల నాణ్యతను, వినియోగాన్ని సమగ్రంగా పరిశీలించింది. వారి వెంట ఏపీఓలు వీబీ జయరామ్‌, బాలయ్య, ఈసీ ముఖీద్‌, సాంకేతిక సహాయకులు (టీఏలు) సౌమ్య, జ్యోతి, భరత్‌, రాఘవేందర్‌రెడ్డి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement