అర్హులందరికీ సంక్షేమ ఫలాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

Aug 16 2026 12:57 AM | Updated on Aug 16 2026 12:57 AM

వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుతో పాటు అర్హులైన పేదలకు కొత్త రేషన్‌ కార్డులు అందిస్తున్నామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభితో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలోని 1,83,013 లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధికి సుమారు రూ.2 వేల కోట్లు మంజూరు చేయించి పనులు చేపట్టారని తెలిపారు. కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి కూడా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యం..

రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రస్థాయి కార్యక్రమం ప్రారంభం కాగా.. జిల్లాస్థాయిలో ముఖ్యఅతిథి పట్నం మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. అర్హులందరికీ రేషన్‌ కార్డులు జారీ చేయడంతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చదివిన పాఠశాల, కళాశాలలో సుమారు రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. జిల్లాకేంద్రంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు తెలిపారు.

స్మార్ట్‌ రేషన్‌కార్డుతో మరిన్ని

వివరాలు తెలుసుకునే అవకాశం..

స్మార్ట్‌ రేషన్‌కార్డుపై ఉన్న బార్‌కోడ్‌ను స్కాన్‌ చేయడంతో రేషన్‌ దుకాణం, లబ్ధిదారులకు అందే రేషన్‌ వివరాలతో పాటు ఇతర సంబంధిత సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు. లబ్ధిదారులకు సకాలంలో రేషన్‌ కార్డులు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, పౌరసరఫరాల డీఎం ఆంజనేయులు, వనపర్తి పుర చైర్‌పర్సన్‌ మాధవి, వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌, పెబ్బేరు మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, పెబ్బేరు మార్కెట్‌యార్డ్‌ చైర్‌పర్సన్‌ ప్రమోదిని, ఆర్డీఓ సుబ్రమణ్యం, సంబంధిత ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement