2025–26 సంవత్సరానికిగాను 9,023 స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకం కింద రూ.7.72 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అదేవిధంగా జిల్లాలోని 5 పురపాలికల్లో 2023–24, 2024–25 సంవత్సరాలకు సంబంధించి 956 సంఘాలకు రూ.3.16 కోట్ల వడ్డీ లేని రుణాలిచ్చినట్లు చెప్పారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం..
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచి పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చామని.. ఈ పథకం ద్వారా 2026, జనవరి 1 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 5,847 మందికి రూ.18.97 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
ప్రత్యామ్నాయ సాగు ప్రోత్సాహం..
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వానాకాలంలో లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మినుములు, కంది, జొన్న, ఆముదం, కూరగాయలు తదితర ఆరుతడి పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి..
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జిల్లాకు 5,887 గృహాలు మంజూరు కాగా.. ఇప్పటి వరకు 88 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ఈ పథకానికి రూ.121 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా 13వ స్థానంలో నిలిచిందని చెప్పారు. 2వ విడతలో నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు మంజూరు కాగా... గుడిసెలు లేని తెలంగాణా తీర్చిదిద్దడంలో భాగంగా జిల్లాలో 1,103 మంది లబ్ధిదారులను గుర్తించి వారిలో అర్హులైన 320 మందికి ఇళ్లు మంజూరు చేయగా వాటిలో 79 బేస్‌మెంట్ వరకు పూర్తయి 24.69 శాతం ముందు వరుసలో ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి పైకప్పు భర్తీ పథకం కింద 500 ఇళ్లు కేటాయించగా నెలాఖరులోగా అర్హులైన వారందరిని గుర్తించి సంబంధిత లబ్ధిదారుకు రూ.2 లక్షలు ఆర్ధిక సాయం అందిస్తుందన్నారు.


