అభివృద్ధిపై అరోపణలు అర్థ రహితం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిపై అరోపణలు అర్థ రహితం

Jul 20 2026 12:20 AM | Updated on Jul 20 2026 12:20 AM

అమరచింత: నియోజకవర్గంలో రూ.1,400 కోట్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతుంటే.. అభివృద్ధి ఎక్కడంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని, ఇది సరికాదని రాష్ట్ర గీత పారిశ్రామిక కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ కేశం నాగరాజ్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్‌పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మంత్రి వాకిటి శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 14 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకురాని చేతగాని పాలన చేశారని.. కాంగ్రెస్‌ హయంలో జరుగుతున్న అభివృద్ధికి చూడలేకపోతున్నారని విమర్శించారు. అమరచింత మండలానికి ఇప్పటి వరకు రూ.124.95 కోట్లు మంజూరు చేశామని.. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులే నిదర్శనమన్నారు. ఆత్మకూర్‌కు రూ.248.02 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. ఎత్తిపోతల పథకాలను విస్మరించడంతో అవి మరుగునపడి రైతులకు సాగునీరు కరువైన పరిస్థితులు బీఆర్‌ఎస్‌ పాలనలో కొనసాగాయని ఆరోపించారు. లిఫ్ట్‌ల మరమ్మతుతో పాటు ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతుంటే కేవలం లబ్ధి కోసం నీచ రాజకీయాలకు పాల్పడటం తగదన్నారు. మరుగునపడ్డ చంద్రగఢ్‌ లిఫ్ట్‌ను వినియోగంలోకి తీసుకొస్తున్నామని, ఆత్మ కూర్‌ మండలం జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

హద్దు మీరితే చర్యలు తప్పవు..

పార్టీలో ఉంటూ ఎవరైనా అక్రమాలకు పాల్పడటం, రౌడీయిజం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని నాగరాజుగౌడ్‌ హెచ్చరించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నాయకుడి వరకు ఎవరైనా ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్‌ జింక సువర్ణ రవి, కాంగ్రెస్‌పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు రవికాంత్‌, రాజేందర్‌రెడ్డి, డీసీసీ కార్యదర్శి రమేష్‌ ముదిరాజ్‌, పార్టీ మాజీ అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్‌కుమార్‌, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement