పోలీస్‌ గ్రీవెన్స్‌కు 17 వినతులు : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 17 వినతులు : ఎస్పీ

Jul 21 2026 12:53 AM | Updated on Jul 21 2026 12:53 AM

వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 17 మంది వినతులు అందజేశారు. ఎస్పీ సునీతారెడ్డి ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించి సంబంధిత పోలీస్‌స్టేషన్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వినతులపై చట్టబద్ధంగా, పారదర్శకంగా, వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతగా పరిగణించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. ప్రజల సమస్యలను వినడం మాత్రమే కాకుండా వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడమే ప్రజావాణి ఉద్దేశమన్నారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

అర్హులందరి పేర్లు ఓటరు జాబితాలో ఉండాలి

వనపర్తి రూరల్‌: అర్హులైన ఓటర్లందరి పేర్లు తుది జాబితాలో కచ్చితంగా ఉండేవిధంగా బీఎల్వోలు కృషి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. సోమవారం పెద్దగూడెం, రాజాపేట, ఆర్‌.తండా, కడుకుంట్ల, పెద్దగూడెంతండా, కిష్టగిరి, నాచహళ్లి, సవాయిగూడెం గ్రామాల్లో కొనసాగుతున్న సర్‌ ప్రక్రియను స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి పరిశీలించి బీఎల్వోలకు పలు సూచనలు చేశారు. సర్‌ ప్రక్రియను ఇంటింటికి చేరవేసి విజయవంతం చేయాలని సూచించారు. బీఎల్వోలు ఇచ్చిన ఎన్యూమరేషన్‌ ఫారాలు తప్పులు లేకుండా నింపి తిరిగి అందజేసి ఓటును కాపాడుకోవాలన్నారు. ఓటరు జాబి తా అత్యంత పారదర్శకంగా, తప్పులు లేకుండా ఉండేలా ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలన్నారు. బీఆర్‌ఎస్‌పార్టీ మండల అధ్యక్షుడు మాణిక్యం, సింగిల్‌విండో అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌లు ఎల్లయ్య, తిరుపతయ్య, పద్మ, మాజీ సర్పంచ్‌లు మాధవ రెడ్డి, ధర్మానాయక్‌, నాయకులు పాల్గొన్నారు.

అతిథి అధ్యాపకుల

నియామకానికి దరఖాస్తులు

వనపర్తి రూరల్‌: పెబ్బేరు బాలికల పాలిటెక్నిక్‌ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ జయచంద్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ 2, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ 4, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ 3, ఇంగ్లీష్‌ 1, మాథ్స్‌ 1, ఫిజిక్స్‌ 1, కెమిస్ట్రీ 1 ఖాళీలు ఉన్నాయని.. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంటెక్‌, బీటెక్‌, పీహెచ్‌డీ పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. అనుభవం, అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు బయోడేటా, సంబంధిత ధ్రువపత్రాలతో 23వ తేదీ సాయంత్రం 4లోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలని వివరించారు. 24న నిర్వహించే మౌఖిక పరీక్షకు అన్ని ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో పాటు ఒక సెట్‌ జిరాక్స్‌, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోల తో హాజరుకావాలని, మరిన్ని వివరాలకు సెల్‌నంబర్‌ 80969 07523 సంప్రదించాలన్నారు.

జీఓనంబర్‌ 12 రద్దు చేయాలి : సీఐటీయూ

వనపర్తి రూరల్‌: జీఓనంబర్‌ 12, కార్మికులకు నిర్వహిస్తున్న సీఎస్‌సీ ఆరోగ్య పరీక్షలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలంటూ సోమవారం తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో కార్మికులు జిల్లాకేంద్రంలోని మర్రికుంట నుంచి కలెక్టరేట్‌కు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గేటు ఎదుట ఆందోళన చేపట్టి రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంధం మదన్‌, కార్యదర్శులు బొబ్బిలి నిక్సన్‌ పాల్గొని మాట్లాడారు. కార్మికులకు సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా అందించాలని, ఇన్స్యూరెన్స్‌ కంపెనీలకు నిధులను మళ్లించరాదని డిమాండ్‌ చేశారు. చిన్న వెంకటయ్య, రామచంద్రయ్యగౌడ్‌, రాబర్ట్‌, బాలస్వామి, పుల్లయ్య, ఆశన్న శాంతన్న, కురుమూర్తి, యాదగిరి, రాజు, స్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement