ప్రభుత్వ ఖజానాకు గండి! | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఖజానాకు గండి!

Jul 22 2026 12:42 AM | Updated on Jul 22 2026 12:42 AM

పెబ్బేరు సంతలో నకిలీ రశీదుల కలకలం

రూ 5.50 కోట్ల అక్రమ వసూళ్లు

వనపర్తి రూరల్‌: పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని సంతలో టెండర్లు లేకుండానే కొందరు కాంట్రాక్టర్లు మున్సిపల్‌ కార్యాలయం పేర నకిలీ రశీదులతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సీపీఎం నాయకులు ఆరోపించారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ 5.50 కోట్ల మేర నష్టం వాటిల్లితుందన్నారు. ఈ మేరకు మంగళవారం వారు మున్సిపల్‌ కమిషనర్‌ గణేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మండల కన్వీనర్‌ మండ్ల రాజు, బాలయ్య మాట్లాడుతూ.. 2025, జనవరి నుంచి 2026, జూలై వరకు మున్సిపాలిటీ తరఫున సంతకు ఎలాంటి టెండర్లు వేయలేదన్నారు. అయినప్పటికీ కొందరు కాంట్రాక్టర్లు మున్సిపాలిటీ పేరుతో నకిలీ రశీదులను ముద్రించి, పురపాలక సంఘానికి ఎలాంటి సంబంధం లేకుండా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వారానికి రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు వసూలు చేస్తున్నా.. ఆ సొమ్మును మన్సిపాలిటీకి గానీ, ప్రభుత్వానికి గాని చెల్లించకుండా కాంట్రాక్టర్లే కాజేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రకంగా ఇప్పటి వరకు సుమారు రూ.5.50 కోట్ల మేర అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులకు కనపడకపోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. వెంటనే స్పందించి అక్రమ వసూళ్లకు పాల్పడిన కాంట్రాక్టర్ల నుంచి సొమ్మును పూర్తిగా రికవరీ చేయాలని, నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

చర్యలు తీసుకుంటాం..

మున్సిపల్‌ కార్యాలయం పేరు మీద నకిలీ రశీదులు ముద్రించి పెబ్బేరు సంతలో దళారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మా దృషికి వచ్చింది. దీనిపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఈ వసూళ్లపై గతంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సంతకు సంబంధించిన భూ వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున్న మేము ఏ చర్యలు తీసుకోలేకపోతున్నాం.

– గణేష్‌ మున్సిపల్‌ కమిషనర్‌, పెబ్బేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement