ఖిల్లాఘనపురం: సమాజంలో బాల్యవివాహాలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి.కళార్చన అన్నారు. శనివారం మండలంలోని మానాజీపేటలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య వివాహాలు చేయడం, అందుకు సహకరించడం చట్టరీత్యా నేరమన్నారు. నియంత్రణకు అధికారులు, ఆశా, అంగన్‌వాడి కార్యకర్తలు, పోలీసులే కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. బాలలతో పనులు చేయించడం చట్టపరంగా నేరమన్నారు. బాల బాలికలు, వయోవృద్ధులు, బడుగు బలహీనవర్గాలు, మహిళలకు ఉచిత న్యాయసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. మోటారు వాహనాలు, సైబర్‌క్రైమ్, పోక్స్, డ్రగ్స్ తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం చట్టాలపై రూపొందించిన లఘు చిత్రాలను ప్రజలతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి కార్తీక్‌రెడ్డి, ప్రథమ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి అశ్విని, ఎస్‌ఐ వెంకటేష్, సర్పంచ్ శ్రీలత, సభ్యులు బాలయ్య, కృష్ణయ్య, శ్రీదేవి, రఘు, విశ్వనాథం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏడుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
మన్ననూర్: స్థానిక పీవీటీజీ గురుకుల పాఠశాల/కళాశాల వసతిగృహంలో ఇటీవల ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారుల పరిశీలన, సమగ్ర విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ఇందుకు బాధ్యులైన ప్రిన్సిపల్ పద్మావతి, డిప్యూటీ వార్డెన్ గీత, ఏఎన్‌ఎం హుస్సేనమ్మతో పాటు మరో నలుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సస్పెన్షన్‌కు గురైన వారి స్థానంలో ఇన్‌చార్జిలతో పాటూ తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బంది నియామకాలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో
ఓటుహక్కు కల్పించాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచ్‌లకు ఓటుహక్కు కల్పించాలని పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సర్పంచ్‌ల సంఘం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వివిధ కమిటీల పేరుతో ఇతరులను అధ్యక్షులుగా నియమించడం తగదన్నారు. జాయింట్ చెక్‌పవర్‌ను రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన ఎన్‌ఆర్‌జీసీ నిధులను ఆయా గ్రామాలకే కేటాయించాలన్నారు. సర్పంచ్‌ల గౌరవ వేతనం రూ.25 వేలకు పెంచాలని, కలెక్టర్ వెంటనే గ్రీన్ చానల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే విజన్–2047, వికసిత్ భారత్ వంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయన్నారు. కార్యక్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా సర్పంచ్‌ల ఫోరం కన్వీనర్ రాజశేఖర్, వనపర్తి జిల్లా కన్వీనర్ శేఖర్‌గౌడ్, నాగర్‌కర్నూల్ జిల్లా నాయకురాలు వీరోజు సుప్రియ తదితరులు పాల్గొన్నారు.
హుండీ ఆదాయం రూ.10.67 లక్షలు
చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయానికి సంబంధించి అమావాస్య, శని, సోమవారాలను పురస్కరించుకొని భక్తులు కానుకలుగా సమర్పించిన హుండీ డబ్బులను ఆలయ అధికారులు శనివారం లెక్కించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.10,67,669 వచ్చినట్లు ఆలయ చైర్మన్ బాలరాజు, ఈఓ మధనేశ్వరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో బాలాజీ ట్రస్ట్ సభ్యులు, ఆలయ ఇన్‌స్పెక్టర్ వాసు, సభ్యులు తిరుపతిరెడ్డి, భాస్కరచార్యులు, నాగార్జున, భరత్‌కుమార్‌రెడ్డి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.


