పౌల్ట్రీ ఫాంపై ఈగల్‌ బృందం దాడులు | - | Sakshi
Sakshi News home page

పౌల్ట్రీ ఫాంపై ఈగల్‌ బృందం దాడులు

Jul 20 2026 12:20 AM | Updated on Jul 20 2026 12:20 AM

ఉమ్మడి జిల్లాలో

సుపరిచితుడు

రూ.20 లక్షల విలువచేసే 1.150 కిలోల ఆల్ఫాజోలం సీజ్‌

ఆల్ఫాజోలం డాన్‌తోపాటు

మరో ముగ్గురి అరెస్టు

మహబూబ్‌నగర్‌ క్రైం: గతంలో ఆల్ఫాజోలం తయారు చేసి పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చాడు.. అయినా అతనిలో మార్పు రాకపోగా.. మళ్లీ అదే పద్ధతిని ఎంచుకొని ఆల్ఫాజోలం తయారు చేస్తూ.. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలంలోని తుంకినీపూర్‌ గ్రామానికి చెందిన ఎం.జయప్రకాష్‌గౌడ్‌, అదే గ్రామానికి చెందిన బాల ఆంజనేయులు ఇద్దరూ కలిసి అన్నాసాగర్‌ గ్రామ శివారులో బోయ నర్సింహులు అనే వ్యక్తి దగ్గర నెల రోజుల కిందట లక్ష్మీనర్సింహ పౌల్ట్రీ ఫాంను అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత పౌల్ట్రీ ఫాంలో రూ.40 లక్షల విలువ చేసే మిషన్‌ ఏర్పాటు చేసి.. ఆల్ఫాజోలం తయారు చేయడానికి రూ.20 లక్షల విలువ చేసే మెటీరియల్‌ సమకూర్చారు. అనంతరం వికారాబాద్‌కు చెందిన కృష్ణయ్యగౌడ్‌తో కలిసి జయప్రకాష్‌గౌడ్‌ ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్‌ ఈగల్‌ పోలీస్‌ బృందం ఆదివారం మధ్యాహ్నం ఆకస్మిక దాడులు చేసి.. రూ.20.30 లక్షల విలువ చేసే 1.150 కిలోల ఆల్ఫాజోలంతోపాటు మరో రూ.20 లక్షల విలువ చేసే మెటీరియల్‌ను సీజ్‌ చేశారు. అలాగే ఆల్ఫాజోలం సూత్రధారి జయప్రకాష్‌గౌడ్‌తోపాటు కృష్ణయ్యగౌడ్‌, బాలాంజనేయులు, నర్సింహులును సైతం ఈగల్‌ ఫోర్స్‌ బృందం అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ తరలించింది.

బీటెక్‌ చదివి..

తుంకినీపూర్‌కు చెందిన జయప్రకాష్‌గౌడ్‌ బీటెక్‌ చదువు మధ్యలో వదిలేశాడు. మొదట్లో వీఆర్‌ఐగా కొన్ని రోజులు పనిచేశాడు. ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని ఓల్డ్‌ బోయినపల్లిలో మేధా హైస్కూల్‌ ఏర్పాటు చేసి దాదాపు తొమ్మిదేళ్లు నడిపాడు. ఇదే సమయంలో ఓ వ్యక్తితో ఆల్ఫాజోలం తయారు చేసే ఫార్ములాను నేర్చుకున్నాడు. ఆ తర్వాత స్వయంగా అతను నిర్వహిస్తున్న పాఠశాలను అడ్డాగా చేసుకొని ఆల్ఫాజోలం తయారు చేయడం మొదలుపెట్టాడు. పాఠశాలలో అయితే ఎవరికి అనుమానం రాదని భావించి అక్కడే రెండు గదుల్లో ఈ దందా సాగించాడు. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్‌ 13న ఈగల్‌ ఫోర్స్‌ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. అతని నుంచి 8 కిలోల ఆల్ఫాజోలం, రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జైలుకు వెళ్లిన జయప్రకాష్‌గౌడ్‌ మళ్లీ ఈ ఏడాది మార్చి 16న జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి మకాం మార్చాడు.

మూడు రోజుల నుంచి తనిఖీలు

హైదరాబాద్‌కు చెందిన ఈగల్‌ ఫోర్స్‌ బృందాలు మూడు రోజుల నుంచి అన్నాసాగర్‌ శివారులో ఆల్ఫాజోలం తయారు చేస్తున్నట్లు సమాచారం తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. చివరికి ఆదివారం ఆరు కారులలో దాదాపు 20 మంది ఈగల్‌ ఫోర్స్‌ పోలీసులు స్థావరంపై ఆకస్మిక దాడులు చేసింది.

ఆల్ఫాజోలం తయారీలో మంచి పట్టుసాధించిన జయప్రకాష్‌గౌడ్‌ రెండేళ్ల వ్యవధిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని కల్లు దుకాణాలకు సుపరిచితుడిగా మారాడు. అతను తయారు చేసిన ఆల్ఫాజోలం ఉమ్మడి జిల్లాలో ఉన్న పలు కల్లు దుకాణాలకు సరఫరా అవుతున్నట్లు సమాచారం. వీటిని సరఫరా చేయడానికి స్థానికంగా మంచి నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో సైతం ప్రత్యేకంగా కొందరిని ఏర్పాటు చేసుకొని కల్లు దుకాణాలకు వీటిని సరఫరా చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement