తాగునీటి సరఫరాలో ఇబ్బందులు వద్దు
అమరచింత: వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని.. ప్రజలు తాగునీరు అందక ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఉరుకోమని, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై చర్యలు తప్పవని మిషన్ భగీరథ ఎస్‌ఈ కె.వెంకటరమణ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని మిషన్ భగీరథ పంప్‌హౌజ్‌ను ఆయన సందర్శించారు. జిల్లాలో మిషన్ భగీరఽథ పైప్‌లైన్ లీకేజీలు, మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపడుతూ నీటి సరఫరా చేస్తున్నా ఎందుకు ప్రజలకు అందించడం లేదని సిబ్బందిని ప్రశ్నించారు. వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలోని 150 తాగునీటి పథకాలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా తాగునీటిని అందిస్తున్నామని.. అలాంటిది అమరచింత మున్సిపాలిటీకి మాత్రం నీటిని అందించడంలో సమస్యలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయని మిషన్ భగీరఽథ ఏఈలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ సిబ్బంది, మున్సిపల్ వాటర్‌మెన్‌ల మధ్య సమన్వయం లేకనే నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందన్నారు. రోజువారీగా ఎన్ని లీటర్ల నీటిని అందిస్తున్నామనే విషయంతో పాటు ఓవర్‌హెడ్ ట్యాంకులు నిండిన తర్వాతే వాటిని మున్సిపల్ వాటర్‌లైన్‌మెన్‌లకు అప్పగించాల్సిన బాధ్యత మిషన్ భగీరథ సిబ్బందిపై ఉందని తెలిపారు. రెండు జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు లేవని.. కావాల్సిన నీరు ఆయా జలాశయాల్లో ఉన్నాయని, వేసవి పూర్తయ్యే వరకు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. ప్రజలు తమ అవసరాలకు ఎంత మేర అవసరమో అంతే నీరు పట్టుకొని కొళాయిలను కట్టి ఉంచాలని, నీటిని వృథా చేయొద్దని సూచించారు. సమావేశంలో ఈఈ మేఘారెడ్డి, ఏఈలు రుక్మేందర్‌రెడ్డి, హర్షవర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు.
పైప్‌లైన్ల మరమ్మతుకు ప్రత్యేక చర్యలు
మిషన్ భగీరథ ఎస్‌ఈ కె.వెంకటరమణ


