చేనేత మగ్గం నేసి..
గద్వాల జరీ చీరల ప్రాముఖ్యత తెలుసుకున్న గవర్నర్ చేనేత స్టాల్ దగ్గర కార్మికులతో మాట్లాడారు. నెలకు ఎన్ని చీరలు నేస్తారు.. కూలీ ఎంత వస్తుందని ఆరాతీశారు. ఖండాంతర ఖ్యాతి ఘడించిన గద్వాల జరీ చీరల ప్రాముఖ్యతను మరింత ఇనుమడింపజేయాలని సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్‌లో మగ్గంపై కూర్చొని చీర నేసే విధానాన్ని పరిశీలించి.. రాట్నం ద్వారా ధారం చుట్టారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరాల వివరాలు తెలుసుకుని ప్రశంసించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో రాజ్‌భవన్‌ను లోక్‌భవన్‌గా మార్చామన్నారు. అంతకు ముందు కలెక్టర్ సంతోష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా భౌగోళిక స్వరూపం, చరిత్ర, ప్రసిద్ధ క్షేత్రాలు, ప్రాముఖ్యత, సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు గద్వాల జరీ చీర ఫ్రేమ్‌ను జ్ఞాపికగా అందజేశారు.


