రహదారి భద్రతపై విస్తృత అవగాహన
● టోల్‌ఫ్రీ నంబర్ 1033కి సమాచారం ఇవ్వాలి
● కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి: రహదారి భద్రత వారోత్సవాలు జనవరిలో కొనసాగనున్నాయని.. గ్రామాల్లో రహదారి ప్రమాదాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన రోడ్డు భద్రత జిల్లాస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. పోలీస్, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో సర్వే చేసి జాతీయ రహదారి, ఆర్‌అండ్‌బీ రహదారులపై ప్రమాదాలు జరగకుండా ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టాలనే విషయాలపై నివేదిక అందజేయాలన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరిగితే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1033కి సమాచారం ఇవ్వాలనే విషయాన్ని ప్రజలందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అంబులెనన్స్ సిబ్బంది క్షతగాత్రులను దగ్గర్లోని ఏ ఆస్పత్రికి తీసుకెళ్లాలనే విషయాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకొని ఉండాలన్నారు. జిల్లాలోని జాతీయ రహదారిపై గుర్తించిన వెల్టూరు, పాలెం, మదర్ థెరిస్సా కూడలి, అమడబాకుల, రంగాపూర్, ఆనందభవన్ తదితర బ్లాక్‌స్పాట్లలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నప్పటికీ కొనసాగడానికి కారణాలు ఏమిటనే విషయాలు అన్వేషించాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, వేగం కొలిచే యంత్రాలు వంటివి సిద్ధం చేయాలన్నారు.


