క్రమశిక్షణ, పారదర్శకత తప్పనిసరి : ఎస్పీ
వనపర్తి: నేర రికార్డులను తప్పులు లేకుండా సక్రమంగా నిర్వహించాలని ఎస్పీ సునీతరెడ్డి ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయాన్ని ఆమె సందర్శించగా డీఎస్పీ వెంకటేశ్వరరావు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. కార్యాలయంలో వివిధ రికార్డులతో పాటు షీ టీం పనితీరు రికార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో అలసత్వం ఉండరాదని, ప్రతి నమోదు న్యాయ ప్రక్రియకు ఆధారంగా నిలుస్తుందని అధికారులను అప్రమత్తం చేశారు. తర్వాత డీఎస్పీతో సమావేశమై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, గ్రేవ్ కేసుల పురోగతి, విచారణ స్థితిగతులపై ఆరా తీశారు. ప్రతి కేసు చట్టబద్ధంగా, బాధితులకు న్యాయం జరిగేలా దర్యాప్తు సాగాలని సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేదని.. ప్రతి కేసు చట్టబద్ధంగా, నిర్దిష్ట గడువులోగా పక్కా ఆధారాలతో ముందుకు సాగాలన్నారు. రికార్డుల నిర్వహణలో పొరపాట్లు ఉంటే న్యాయస్థానాల్లో కేసులు బలహీనపడతాయని బాధ్యతతో మెలగాలని, బాధితులకు భద్రత, గౌరవం, న్యాయం కల్పించడమే పోలీసుశాఖ ప్రధాన కర్తవ్యమని తెలిపారు. ప్రతి విభాగంలో క్రమశిక్షణ, పారదర్శకత తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆమె వెంట సీఐ కృష్ణయ్య, డీసీఆర్బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి, పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్, రూరల్ ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి, గోపాల్‌పేట ఎస్‌ఐ నరేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
నేడు కోస్గికి సీఎం రాక
కోస్గి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం కోస్గికి రానున్నారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ వినీత్‌తో కలిసి నారాయణపేట, వికారాబాద్ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ప్రతీక్ జైన్ పరిశీలించారు. పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించే స్థానిక లక్ష్మీనర్సింహ ఫంక్షన్‌హల్‌తోపాటు సభాస్థలం, హెలీప్యాడ్, సీఎం కాన్వాయ్ రూట్, వాహనాల పార్కింగ్, బారికేడ్లు తదితర భద్రతాపరమైన అంశాలను పరిశీలించి.. అధికారులకు సూచనలు చేశారు. అనంతరం వికారాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన 800 మంది పోలీసులతో ఎస్పీ వినీత్ సమావేశమై మాట్లాడారు. మొత్తం 10 సెక్టార్లుగా విభజించి.. ఏఎస్పీలు, డీఎస్పీలను ఇన్‌చార్జిలుగా నియమించామని తెలిపారు. ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం జరిగే ప్రదేశంలో అదనపు బలగాలతో భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సీఎం కాన్వాయ్ రూట్‌లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, ప్రజలకు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు.
‘ఉపాధి కల్పన’ను
వినియోగించుకోవాలి
పాన్‌గల్: గ్రామీణ ప్రాంత యువత, మహిళలు, రైతులు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని తెలంగాణ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి మహబూబ్‌నగర్ ప్రాంతీయ అధికారి సైదా, ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ అబ్బాస్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జ్యోతి కోరారు. సోమవారం మండలంలోని మల్లాయిపల్లిలో సర్పంచ్ నాగిరెడ్డి అధ్యక్షతన ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించగా.. వారు పాల్గొని మాట్లాడారు. ఈ పథకం ద్వారా అందే రుణాలకు 25 శాతం, 35 శాతం రాయితీ అందుతుందని వివరించారు. సమావేశంలో బ్యాంకు మేనేజర్ కృష్ణమూర్తి, ఆయా శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
క్రమశిక్షణ, పారదర్శకత తప్పనిసరి : ఎస్పీ


