ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు
వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం
వనపర్తి: పోలీసు బాధ్యతను మానవీయ విలువలతో మేళవిస్తూ ప్రజలకు సేవలు అందించాలని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యలను ఎస్పీ నేరుగా తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 11 ఫిర్యాదులు అందగా.. సంబంధిత అధికారులతో ఎస్పీ మాట్లాడి బాధితుల సమస్యలు త్వరగా పరిష్కించేలా కృషిచేయాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుకు న్యాయం జరిగే వరకు పోలీసుశాఖ బాధ్యతగా పనిచేస్తుందని బాధితులకు భరోసానిచ్చారు. ఫిర్యాదుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకునేలా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. ప్రజల నమ్మకమే పోలీసు శాఖ బలమని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన లక్ష్యమని అన్నారు.
దివంగత పార్లమెంట్ సభ్యుడు, సామాజిక కార్యకర్త జి.వెంకటస్వామి ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం వెంకటస్వామి వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సామాన్య ప్రజల సమస్యలను పార్లమెంట్ వేదికపై ధైర్యంగా ప్రస్తావించిన ప్రజాప్రతినిధి వెంకటస్మామి అని.. ఆయన సేవలు, ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. తన జీవితాన్ని పూర్తిగా ప్రజాసేవకు అంకితం చేసిన మహానీయుడు అని కొనియాడారు. ఆయన చూపిన సేవా మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, పోలీసు కార్యాలయ ఏఓ సునంద, సీఐ కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్ పాల్గొన్నారు.


