పల్లెల్లో నవశకం..
అవరోధాలు లేకుండా పూర్తి..
సజావుగా ప్రక్రియ..
●
అమరచింత/మదనాపురం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించిన అభ్యర్థులు సోమవారం సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలో మొత్తం 268 గ్రామ పంచాయతీలకు గాను 267 జీపీల్లో పాలకవర్గాల ప్రమాణస్వీకార కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగింది. పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులచే అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త సర్పంచులు తమ పేర్లను ప్రస్తావిస్తూ.. అందరి భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి పాటుపడుతామని, రాజకీయాలు, వర్గ విభేదాలకు తావివ్వకుండా అందరినీ సమాన దృష్టితో సంక్షేమ పథకాలు అందించేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామాలుగా తీర్చిదిద్దడమే కాకుండా అక్షరాస్యతలో సైతం తమ గ్రామాలను ముందుంచుతామన్నారు. కాగా, మదనాపురం మండలం కొత్తపల్లిలో సర్పంచ్ బంధువు ఒకరు మృతిచెందడంతో ప్రమాణ స్వీకారోత్సవం వాయిదా పడినట్లు జిల్లా పంచాయతీ అధికారి వెల్లడించారు. పెబ్బేరు మండలం వై శాగాపూర్, తోమాలపల్లె, కంచిరావుపల్లి గ్రామాల్లో కొలువుదీరిన పాలకవర్గాలను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి శాలువాలతో సత్కరించారు.
పండుగ వాతావరణంలో..
సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జిల్లాలోని పలు పంచాయతీ కార్యాలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. కొన్ని భవనాలకు పెయింటింగ్ వేయించడంతో పాటు మామిడాకులు, బంతిపూల తోరణాలతో అలంకరించారు. పంచాయతీ కార్యాలయ ఆవరణల్లో టెంట్లు వేయడంతో పండుగ వాతావరణం కనిపించింది.
కొన్ని జీపీలకు రంగే లేదు..
జిల్లాలోని కొన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలను నామమాత్రపు ముస్తాబు చేయడంతోనే సరిపెట్టారు. భవనాలకు కొత్తగా పెయింటింగ్ వేయకపోవడంతో పాలకవర్గాలు అసంతృప్తికి గురయ్యాయి. కొందరు ఇదేం పద్ధతని పంచాయతీ కార్యదర్శులను అడిగితే డబ్బులు లేవని సమాధానం ఇచ్చినట్లు ఆయా గ్రామాల సర్పంచులు తెలిపారు.
జిల్లాలో పంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాలను పండుగ వాతావరణంలో పూర్తిచేశాం. అన్ని మండలాల్లో ఎంపీడీఓలు, ఎంపీఓలు ఆయా గ్రామ పంచాయతీలకు హాజరై సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులచే ప్రమాణం చేయించారు. ఎక్కడ ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని పూర్తిచేశాం.
– రఘనాథ్‌రెడ్డి, ఇన్‌చార్జి డీపీఓ
రెండేళ్ల తర్వాత పంచాయతీల్లో
కొలువుదీరిన పాలక వర్గాలు
అట్టహాసంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులు
జిల్లాలో 268 గ్రామ పంచాయతీలు
జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు, గెలిచిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారోత్సవం వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జిల్లా అధికారులు సమన్వయంతో పూర్తిచేశారు. చిన్నచిన్న పొరపాట్లకు సైతం తావివ్వకుండా కలెక్టర్ నేతృత్వంలో అధికారులు, సిబ్బంది చేసిన కృషి ఫలితంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ, పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.


