వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో జాగృతి
గద్వాల టౌన్: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా జాగృతి వైపు నుంచి మేం పోటీలో ఉంటాం.. పేరు అదే ఉంటదా.. ఇంకొకటి ఉంటదా.. అనేది సెకండరీ.. 2029లో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రెండు రోజుల జాగృతి జనంబాట కార్యక్రమం అనంతరం సోమవారం గద్వాల జిల్లాకేంద్రంలోని హరిత హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నప్పుడే తనకు, తన ఫ్యామిలీకి మధ్య అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయని వివరించారు. తన భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని, తీన్మార్ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ నుంచి ఏ ఒక్కరూ మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా పార్టీ నాయకులే నాపై కుట్ర చేసి ఎంపీగా ఓడించారని, వద్దంటే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని చెప్పారు. తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పదవిలో ఉన్నా.. లేకున్నా ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటామని చెప్పారు. ఎంపీగా ఉన్న సమయంలో ‘మన ఊరు– మన ఎంపీ’ పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టానని గుర్తుచేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం జాగృతి జనం బాట చేపట్టిందని వివరించారు.


