గవర్నర్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
వనపర్తి: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. పోలీసు గౌరవ వందనం సమర్పణ, సాంస్కృతిక కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలపై రూపొందించిన స్టాళ్ల సందర్శన, మొక్కలు నాటే కార్యక్రమం, ఫొటో సెషన్‌లో గవర్నర్ పాల్గొంటారన్నారు. అనంతరం జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రశంసలు పొందిన కవులు, కళాకారులతో గవర్నర్ పరిచయ కార్యక్రమం ఉంటుందని.. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, జిల్లా పౌరసంబంధాల అధికారి పి.సీతారాం, తహసీల్దార్ రమేశ్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ భానుప్రకాశ్ ఉన్నారు.
ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యాదయ్య, ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంలతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 20 అర్జీలు అందగా.. సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గం చూపాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా 2025 ఓటరు జాబితాను 2002 ఎస్‌ఐఆర్‌తో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్‌రెడ్డి వీసీ నిర్వహించగా.. కలెక్టరేట్‌లోని వీసీ హాల్ నుంచి అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఇప్పటివరకు 48.96 శాతమే పూర్తి చేశారని.. మరింత వేగవంతం చేసి వందశాతం లక్ష్యం సాధించాలన్నారు. రోజు ప్రతి మండలంలో 100 మందిని మ్యాపింగ్ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ విషయంపై బూత్‌స్థాయి అధికారులకు సూచనలు చేయాలని.. 10 శాతం కన్నా తక్కువ ఉన్నవారికి షోకాస్ నోటీసులు ఇవ్వాలన్నారు. అదే విధంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాలో బ్లర్‌గా ఉన్న ఫొటోలను పోలింగ్ కేంద్రాల వారీగా గుర్తించి.. ఫాం–8 ద్వారా ఫొటోలను బీఎల్‌ఓలతో అప్‌డేట్ చేయించే ప్రక్రియను కూడా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.


