‘పోరాటాలకు సిద్ధం కావాలి’
వనపర్తిటౌన్: రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.జంగయ్య ఆరోపించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీవో భవనంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.రవిప్రసాద్‌గౌడ్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరగగా.. ఆయనతో పాటు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ ముఖ్యఅతిథులుగా హాజరై టీఎఫ్‌ఐ, టీఎస్‌టీయూఎఫ్ జెండాలను ఆవిష్కరించారు. జంగయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, రెండేళ్లు గడుస్తున్నా పీఆర్సీ అమలు కాలేదని విస్మయం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, డీఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. డీఈఓ అబ్దుల్ ఘనీ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని, పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. కె.జ్యోతి, బి.వెంకటేష్, తిమ్మప్ప, శ్రీనివాస్‌గౌడ్, అరుణ, ఆర్.రామన్‌గౌడ్, మురళి, రాముడు, అగ్రిప్ప, రియాజ్, చెన్నకేశవులు, జి. కృష్ణ, అనసూయా, జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బి.నరేందర్ పాల్గొన్నారు.
నేటినుంచి రాష్ట్రస్థాయి
హాకీ పోటీలు
వనపర్తి రూరల్: కడుకుంట్లలో గురువారం నుంచి రెండ్రోజుల పాటు ఎస్జీఎఫ్ అండర్–14 రాష్ట్రస్థాయి బాలికల హాకీ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి, పీడీ నిరంజన్‌గౌడ్ తెలిపారు. క్రీడల్లో ఉమ్మడి పది జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు.


