‘సైబర్’దే జోరు..!
జిల్లా వార్షిక నేర సమీక్షలో ఎస్పీ సునీతరెడ్డి
‘ప్రజావాణి’లో వెనుకబాటు..
వనపర్తి: జిల్లాలో సాధారణ చోరీలు గతేడాదితో పోలిస్తే తగ్గుముఖం పట్టగా.. సైబర్ నేరాల సంఖ్య రెండింతలు పెరిగింది. అధికారులు నిత్యం సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నా.. నేరగాళ్లు కొత్త పంథాల్లో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారనేందుకు ఎస్పీ డి.సునీతరెడ్డి బుధవారం వెల్లడించిన వార్షిక నేర నివేదికతో స్పష్టమవుతోంది. 2024లో సైబర్ నేరాలు 64 నమోదు కాగా.. 2025 నవంబర్ వరకే 122కు చేరడం గమనార్హం. అఽధికారిక లెక్కల ప్రకారం.. జిల్లాలో సైబర్ నేరాలను తగ్గించేందుకు 596 అవగాహన సదస్సులు నిర్వహించినా.. ప్రయోజనం ఆశాజనకంగా లేకపోవడం శోచనీయం. ఇకపోతే.. ఆర్థిక ప్రయోజనాల కోసం చేసిన హత్యలు గతేడాది ఒకటి నమోదుకాగా.. 2025లోనూ అదే సంఖ్య పునరావృతమైంది.
స్వల్పంగా పెరిగిన రికవరీ..
జిల్లాలోని 15 పోలీస్‌స్టేషన్ల పరిధిలో గతేడాది 264 కేసులు.. 2025లో 211 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఛేదించిన కేసుల సంఖ్య తగ్గువగా ఉన్నా.. సొమ్ము రికవరీ మాత్రం గతేడాది కంటే స్వల్పంగా పెరిగింది. 2024లో 158 కేసులు ఛేదించి చోరీ సొమ్ములో 43.51 శాతం రికవరీ చేయగా.. 2025లో 148 కేసులు ఛేదించి 52 శాతం సొమ్ము రికవరీ చేసినట్లు వార్షిక నివేదికలో పేర్కొన్నారు.
పోక్సో కేసులు రెండింతలు..
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పోక్సో కేసుల సంఖ్య అసాధారణంగా పెరిగినట్లు అధికారిక లెక్కలతో స్పష్టమవుతోంది. 2024లో 44 కేసులు నమోదు కాగా.. 2025లో ఇప్పటి వరకు ఆ సంఖ్య 80కి చేరడం గమనార్హం. వీటితోపాటు బలవన్మరణాలు సైతం స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. అత్యాచారం కేసులు గణనీయంగా తగ్గాయి. గతేడాది 10 నమోదు కాగా.. 2025 ఇప్పటి వరకు 4 కేసులు మాత్రమే ఉన్నాయి.
2,049 సీసీ కెమెరాలతో నిఘా..
జిల్లాలో నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా 2,049 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. వీటిలో కొన్ని సాంకేతిక సమస్యతో నిరుపయోగంగా మారగా మరమ్మతు చేయిస్తున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి శ్రీధర్‌రెడ్డి హత్య కేసు, జిల్లాకేంద్రంలో ఏటీఎం చోరీ కేసుపై ఎస్పీ మునుపటి పాత సమాధానం పరిశీలిస్తామని చెప్పడం కొసమెరుపు.
కీలక కేసుల్లో జీవితఖైదు..
గోపాల్‌పేట, ఆత్మకూర్ పీఎస్‌ల పరిధిలోని హత్య కేసుల్లో నేరస్తులకు జీవిత ఖైదు, కొత్తకోట పీఎస్ పరిధిలోని అత్యాచారం కేసులో నేరస్తుడికి 20 ఏళ్ల జైలు, రూ.25 వేల జరిమానా విధించింది. దీంతోపాటు లోక్ అదాలత్‌లో 708 సాధారణ కేసులకు పరిష్కారం లభించింది.
పెరిగిన సైబర్ నేరాలు,
పోక్సో కేసులు, బలవన్మరణాలు
తగ్గిన చోరీలు.. 52 శాతం రికవరీ
రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం
జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి వచ్చిన అర్జీల పరిష్కారంలో ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. 2024తో పోలిస్తే 2025లో అధికారులు కొంత వెనుకబడినట్లు స్పష్టమవుతోంది. గతేడాది 701 అర్జీలు దాఖలు కాగా.. 663 పరిష్కరించారు. 38 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 460 అర్జీలు దాఖలు కాగా.. వాటిలో 324 మాత్రమే పరిష్కరించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీల సంఖ్య 136గా పేర్కొన్నారు. దాఖలైన అర్జీల్లో 25 శాతం పరిష్కారానికి నోచుకోలేదు.
‘సైబర్’దే జోరు..!


