నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు
ఆత్మకూర్: నియోజకవర్గంలో ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం పట్టణంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో జరిగిన పుర ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ మద్దతుదారులను 90 శాతం గెలిపించి తన ఉత్సాహాన్ని రెట్టింపు చేశారని, పుర ఎన్నికల్లో ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని కోరారు. ఇప్పటి వరకు స్థానిక పురపాలికకు రూ.15 కోట్లు, మండలానికి రూ.250 కోట్లు మంజూరయ్యాయని.. రానున్న మూడేళ్లలో మరో రూ.300 కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మండలానికి ఇప్పటి వరకు 500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని.. మరో 500 ఇళ్లు మంజూరు చేయిస్తానని చెప్పారు. అలాగే జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్లతో హైలేవల్ వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని.. ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు.
క్రాప్ హాలిడే అంటూ పుకార్లు..
నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు చూసి ప్రతిపక్ష నేతలు లేనిపోని పుకార్లు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని.. జూరాలకు క్రాప్ హాలిడే, వారబందీ అంటూ వదంతులు సృష్టిస్తున్నారని మంత్రి వాకిటి అసహనం వ్యక్తం చేశారు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో నిర్మించారని, జూరాల కూలుతుందని గతంలో పుకార్లు సృష్టించారని.. అదేమీ కాళేశ్వరం కాదని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని.. ప్రస్తుతం వేల ఇళ్లు నిర్మించుకుంటుంటే తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. ప్రజలు చైతన్యవంతులని.. అన్నీ గమనిస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, నాయకులు గాడి కృష్ణమూర్తి, పరమేశ్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, భాస్కర్, సుదర్శన్‌శెట్టి, షబ్బీర్, కలీం, రవికాంత్, రవీందర్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి వాకిటి శ్రీహరి


