
‘ఆశాల హామీలు నెరవేర్చాలి’
వనపర్తి రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆశా కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లాకేంద్రంలో జిల్లా కమిటి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు మర్రికుంట ధర్నా చౌక్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో కనీస వేతనం రూ.18 వేలు ప్రకటించాలని, రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. అదనపు పనులకు అదనపు వేతనం చెల్లించాలని, అధికారుల వేధింపులు ఆపాలని, పండుగ, వారాంతపు సెలవు సర్క్యులర్ ఇవ్వాలని, పని భారం తగ్గించాలని కోరారు. ఈ సమయంలో పోలీసులకు సీఐటీయూ నాయకులు, ఆశా కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభిని కలిసి డిమాండ్ల వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, నాయకులు బొబ్బిలి నిక్సన్, పీఎన్ రమేష్, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బుచ్చమ్మ, కార్యదర్శి సునీత, భాగ్య, గిరిజ, ఇందిర, సత్యమ్మ, శాంతమ్మ, జ్యోతి, చిట్టెమ్మ, రమాదేవి, శారద పాల్గొన్నారు.