పల్లె పోరుకు రెడీ | - | Sakshi
Sakshi News home page

పల్లె పోరుకు రెడీ

Oct 22 2026 6:56 AM | Updated on Oct 22 2026 6:56 AM

విజయనగరం రూరల్‌:

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జిల్లాలోని 27 జెడ్పీటీసీలు, 449 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఈ నెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చేనెల 3న ఎన్నికలు నిర్వహించి, 5న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనతో ఈ ప్రక్రియ ముగియనున్నది.

● ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి సోమవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలుకాగా, 23న సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల స్వీకరణ ముగిస్తుంది. 24న నామినేషన్ల పరిశీలన, 25న తిరస్కరణ నామినేషన్లపై అప్పీళ్లు, 26న అప్పీళ్లు ప్రక్రియ ముగుస్తుంది. 27న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా అభ్యర్థులు అదేరోజు మధ్యాహ్నం 3 గంటలలోపు బీ–ఫారం సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్‌ 3న పోలింగ్‌ నిర్వహించగా, అవసరమైతే నవంబర్‌ 4న రీ పోలింగ్‌ నిర్వహిస్తారు. నవంబర్‌ 5న ఓట్లలెక్కింపు, ఫలితాల ప్రకటన జరుగుతుంది.

● ఎన్నికల వ్యయ పరిమితి

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిర్ణీత వ్యయ పరిమితులను పాటించాల్సి ఉంటుంది. ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు గరిష్ఠ ఎన్నికల వ్యయ పరిమితి రూ. 4 లక్షలు కాగా, జెడ్పీటీసీ అభ్యర్థులు రూ.8 లక్షలుగా నిర్ణయించారు.

● సెక్యూరిటీ డిపాజిట్‌ వివరాలు

ఎంపీటీసీ అభ్యర్థులు జనరల్‌, ఇతర కేటగిరీలకు రూ.3 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1500లు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలి. జెడ్పీటీసీ అభ్యర్థులు జనరల్‌, ఇతర కేటగిరీలకు రూ.6 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.3 వేలు సెక్యూరిటీ డిపాజిట్‌గా నిర్ణయించారు.

● ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియతో పాటు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, తదితర అంశాలను వివరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. కులాలు, మతాలు, వర్గాల మధ్య విధ్వేషాలు సృష్టించే చర్యలకు పాల్పడరాదని, కులం, మతం ఆధారంగా ఓట్లు అడగడం, ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించడం నిషేధమని తెలిపారు.

● ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, బహుమతులు, మద్యం, ఇతర ప్రయోజనాలు పంపిణీ చేయడం, బెదిరించడం, బలవంతం చేయడం వంటి చర్యలకు పాల్పడితే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, సంబంధిత అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా సహకరించాలని కలెక్టర్‌ కోరారు.

ఎన్నికల స్థానాలు, పోలింగ్‌ కేంద్రాలు

జిల్లాలో 449 ఎంపీటీసీ స్థానాలు, 27 ఎంపీపీ, 27 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ నిర్వహించనుండగా, ఇందుకోసం 1586 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు

జిల్లాలోని 775 గ్రామ పంచాయతీలు, 7,308 వార్డులకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ వెల్లడించారు. మొదటి, రెండవ, మూడవ దశలకు వచ్చేనెల 13, 16, 19 తేదీల్లో నోటిఫికేషన్‌ జారీ చేస్తుందని, అందుకు అనుగుణంగా సంబంధిత తేదీల్లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు నోటిఫికేషన్లు జారీ చేస్తారని కలెక్టర్‌ తెలిపారు. ప్రతీ దశలోనూ నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అభ్యర్థిత్వాల ఉపసంహరణ, తుది అభ్యర్థులు జాబితా ప్రచురణ, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన తదితర ఎన్నికల ప్రక్రియలను నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం నిర్వహిస్తారని తెలిపారు. సమావేశంలో డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, జెడ్పీ సీఈఓ పి.కిరణ్‌కుమార్‌, డిప్యూటీ సీఈఓ ఎ.లవరాజు, డీపీఓ మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు

నోటిఫికేషన్‌ జారీ

ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ

నవంబర్‌ 3న పోలింగ్‌

అదేనెల 5న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement