● క్వార్టర్ మీద రూ.10
నుంచి రూ.20 పెంపు
● గంట్యాడ మండలానికి
మినహాయింపు
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
ఓవైపు దసరా పండగ.. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు.. మద్యం వ్యాపారులకు కలిసొచ్చాయి. తాగుడుకు ఎంతైనా ఖర్చుపెట్టడానికి.. ఎంత రేటైనా అడిగేవాళ్లు లేకపోవడంతో మద్యం సిండికేట్లు రెచ్చిపోతున్నారు. మద్యం ధరలను ఎమ్మార్పీకి మించి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో క్వార్టర్ మీద బ్రాండ్ బట్టి రూ.10 నుంచి రూ.20 వరకు పెంచి అమ్ముతున్నారు. మందుబాబులు కూడా గట్టిగా అడిగే ధైర్యం లేక దొరికిందే మందు అనుకుని తాగుతున్నారు. పెంచిన ధరల నుంచి వాటాలు అధికార పార్టీ నేతలకు అందుతున్నట్టు సమాచారం.
సిండికేట్లకు రెక్కలు
గతంలో గజపతినగరం నియోజకవర్గంలో ధరలు పెంచి మద్యం విక్రయాల అంశం సోషల్‌మీడియా, పత్రికల్లో ప్రచురితం కావడంతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. పరువు పోతోందంటూ సిండికేట్ మీద ఫైర్ అయ్యారు. కొద్దిరోజులు ఎమ్మార్పీకి విక్రయించిన సిండికేట్లు మళ్లీ ధరలు పెంచి అమ్ముతున్నారని మందుబాబులే చెబుతున్నారు. గజపతినగరం నియోజకవర్గంలోని దత్తిరాజేరు మండలంలో 4, గజపతినగరంలో 5, బొండపల్లిలో 4, గంట్యాడలో 5 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో చాలా చోట్ల బ్రాండ్లను బట్టి క్వార్టర్‌కు రూ.10 నుంచి రూ.20, హాఫ్ బాటిల్‌కు రూ.50 వరకు పెంచి అమ్ముతున్నట్టు మద్యం కొనుగోలుదారులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
గంట్యాడకు ఆఫర్
నియోజకవర్గంలోని మూడు మండలాల్లోనూ ఇలాగే ధరలు పెంచి అమ్ముతుండగా గంట్యాడలో మాత్రం అదేం కుదరదని టీడీపీ పెద్దలు హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. అది మంత్రిగారి మండలం కావడంతో అక్కడ రేట్లు పెంచితే ఆయనకు ఇబ్బంది అవుతుందని సిండికేట్ సభ్యుల మధ్య ఒక అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో గంట్యాడ మండలంలోని ఐదు షాపుల్లో మాత్రం ఎమ్మార్పికి విక్రయిస్తున్నారు.
ఎకై ్సజ్ అధికారుల కనుసన్నల్లోనే...
ఎకై ్సజ్ అధికారుల కనుసన్నల్లోనే ఎమ్మార్పీ ధరలకు మించి అమ్మకాలు జరుగుతున్నాయ న్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో మద్యం దుకాణం నుంచి నెలవారీ వసూళ్లు అందుకోవడంతో వారు మద్యం విక్రయాల్లో అక్రమ దందాను అడ్డుకోవడానికి వెనుకంజ వేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రతీ గ్రామానికి మద్యం దుకాణాల నుంచి లైసెన్సుదారులే స్వయంగా మద్యం బాటిళ్లను బెల్టుషాపులకు తరలించి అధిక ధరలకు విక్రయాలు చేపడుతున్నా ఎకై ్సజ్ అఽధికారులు పట్టించుకోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి.


