రాజాం: ఎంపీపీ పదవి కోసం రేగిడి మండలానికి చెందిన రెండు టీడీపీ వర్గాలు వివాదానికి దిగాయి. ఏకంగా నియోజకవర్గ ఎమ్మెల్యే ఎదుటే నిరసన చేపట్టారు. ఊహించని ఈ పరిణామం అటు ఎమ్మెల్యేని విస్మయానికి గురిచేయగా, ఇటు టీడీపీ కార్యకర్తల అంతర్గత కలహాలను బయటకు చాటిచెప్పాయి. వివరాల్లోకి వెళితే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనే విషయమై రాజాం మండలం శ్యాంపురం గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ కార్యాలయం వద్ద రేగిడి మండలం టీడీపీ కార్యకర్తలతో ఎమ్మెల్యే సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలో రేగిడి ఎంపీపీ పదవి ఎవరికి కేటాయిస్తారో చెప్పాలని కొంతమంది పట్టుబట్టారు. ఈ పదవిని వేరే వారికి ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే ఓ నేతపేరు చెప్పారు. దీంతో ఈ మండలంలో టీడీపీ రెండో వర్గానికి చెందిన పాలవలస రమణమూర్తితో పాటు అతని అనుచరులు పెద్ద ఎత్తున ఎంపీపీ పదవి తమకే ఇవ్వాలంటూ కేకలు వేశారు. మీకు ఎంపీపీ ఇవ్వలేమని.. జెడ్పీటీసీ స్థానం ఇస్తామని ఎమ్మెల్యే చెప్పగా వెంటనే రమణమూర్తి వర్గీయులు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసారు. మాకు జెడ్పీటీసీ వద్దు...ఎంపీపీ పదవే కావాలంటూ డిమాండ్ చేశారు. అర్ధనగ్న ప్రదర్శన చేసి ఎంపీపీ పదవి కావాలంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే నిరసనలో పాల్గొన్న కోడిశ గ్రామానికి చెందిన రమేష్ అనే కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే తోటి కార్యకర్తలు సపర్యలు చేయడంతో తేరుకున్నాడు. ఈ పరిణామాన్ని చూసి ఎమ్మెల్యే ఒక్కసారిగా బిత్తరపోయాడు. చివరకు తేరుకుని గట్టిగా కేకలు వేస్తూ ముందుగా మీమీ ఎంపీటీసీ స్థానాలు గెలవండి.. ఆ తర్వాత ఎంపీపీ స్థానం గురించి అందరూ కలసి చర్చిద్దామని నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
ఎంపీపీ పదవి కోసం పట్టుబట్టిన
ఓ వర్గం టీడీపీ నాయకులు
ఎమ్మెల్యే ముందు అర్ధనగ్న ప్రదర్శన
అవాక్కయిన ఎమ్మెల్యే కోండ్రు
మురళీమోహన్


