ఇండక్షన్‌తో కొత్త కష్టాలు! | - | Sakshi
Sakshi News home page

ఇండక్షన్‌తో కొత్త కష్టాలు!

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

ఇండక్షన్‌తో కొత్త కష్టాలు! అవగాహన లేమి.. విద్యుత్‌ బిల్లులు భారం

అంగన్‌వాడీలకు ప్రభుత్వం స్టౌల పంపిణీ

కేంద్రాల్లో తప్పని అవస్థలు

నిలిపేసిన గ్యాస్‌ సరఫరా

కరెంట్‌ పోతే ఆయాలకు అష్టకష్టాలు

అవగాహన కల్పించాం

రామభద్రపురం:

అంగన్‌వాడీ కేంద్రాలకు కూటమి ప్రభుత్వం సరఫరా చేసిన ఇండక్షన్‌ స్టౌలతో అంగన్‌వాడీల పరిస్థితి పొయ్యిలో నుంచి పెనం మీద పడినట్లుగా తయారైంది. ఇండక్షన్‌ స్టౌలు కొత్త కష్టాలను తెచ్చిపెట్టాయి. అంగన్‌వాడీ సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఆర్భాటాలు చేస్తూనే ఇబ్బందుల్లోకి నెడుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్‌ కొరత ఏర్పడడాన్ని సాకుగా చూపుతూ వంట గ్యాస్‌ సిలిండర్ల సరఫరాను నిలిపేసి ప్రత్యామ్నాయంగా విద్యుత్‌ ఆధారిత ఇండక్షన్‌ స్టౌలను పంపిణీ చేసింది. వండుతున్న సమయంలో కరెంటు పోతే ఇండక్షన్‌ స్టౌ పని చేయకపోవడంతో వంటకు ఆటంకం ఏర్పడి కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు.అలాగే విద్యుత్‌ బిల్లులు తడిసి మోపెడయ్యే ప్రమాదం లేకపోలేద ని విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 2499 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి రూ.7 వేలు విలువ చేసే ఇండక్షన్‌ స్టౌతో పాటు 4 రకాల వంట పాత్రలు పంపిణీ చేశారు. ఇకపై వి ద్యుత్‌ ఆధారిత స్టౌలపైన వంట చేసి చిన్నారులకు పోషకాహారం వడ్డించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా అస్తవ్యస్తంగా ఉంటుంది. దీంతో సకాలంలో పిల్లలకు భోజనాలు వడ్డించలేక అంగన్‌వాడీలు ఇబ్బందులు పడుతున్నారు.

ఇండక్షన్‌ స్టౌల వాడకంపై అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందికి ఏ మాత్రం అవగాహన లేదు. ఈ సామ గ్రి సరఫరా చేసిన కొత్తలో కేంద్రాల కార్యకర్తలకు సూచనప్రాయంగా చెప్పారంతే. వీటిని వినియోగించే ఆయాలకు అవగాహన కల్పించలేదు. గ్యాస్‌ స్టౌపై అయితే ఏ పాత్రలైనా పని చేస్తాయి. ఇండక్షన్‌ స్టౌపై అన్ని పాత్రలు పని చేయవు. ఇండక్షన్‌ బేస్‌ లేదా అడుగు భాగంలో కాపర్‌ ఉన్న పాత్రలు మాత్రమే ఉపయోగించాలి. గ్యాస్‌ స్టౌపై ఎంత పెద్ద పాత్రలైనా పెట్టి వంట చేసేవారు. ఇండక్షన్‌ స్టౌలపై భారీ పాత్రలు పెట్టి వంట చేసే పరిస్థితి లేకపోవడంతో అంగన్‌వాడీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండక్షన్‌ స్టౌపై వంట చేస్తున్న సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే మళ్లీ కట్టెల పొయ్యిపై కుస్తీపట్టాల్సిందేనని అంగన్‌వాడీలు వాపోతున్నారు.

ఇండక్షన్‌ స్టౌ పంపిణీ చేసిన తర్వాత ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి విద్యుత్‌ బిల్లులు కోసం ప్రభుత్వం రూ. 500 చొప్పున్న ఇస్తున్నట్టు అధికారిక సమాచారం. అయితే గతంలో అద్దె భవనాల్లో నిర్వహించిన కేంద్రాలకు అద్దెతో పాటు విద్యుత్‌ బిల్లులు ఇచ్చేవారు. ప్రభుత్వ భవనాల్లో నిర్వహించిన కేంద్రాలకు ఆయా అంగన్‌వాడీలు బిల్లులు సబ్‌మిట్‌ చేస్తే ఆ బిల్లులు ఇచ్చేవారు. ఆ బిల్లులు ఒక్కో కేంద్రానికి ఒక ఫ్యాన్‌, ట్యూబ్‌లైట్‌ ఉంటే విద్యుత్‌ వినియోగాన్ని బట్టి నెలకు కనీసం సుమారు.రూ.300 నుంచి రూ.450 వరకు బిల్లు వస్తుంది. ఇప్పుడు విద్యుత్‌ ఆధారిత ఇండక్షన్‌ స్టౌలు పంపిణీ చేసిన తర్వాత అన్ని కేంద్రాలకు నెలకు రూ.500 చొప్పున్న బిల్లులు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇండక్షన్‌ స్టౌపై వంట చేస్తే రోజుకు కనీసం అరగంట పాటు వినియోగిస్తే విద్యుత్‌ బిల్లులు తడిసి మోపెడవుతాయని వాటిని చెల్లించుకోవాలంటే కష్టతరమవుతుందని అంగన్‌వాడీలు వాపోతున్నారు. పలు కేంద్రాల్లో చాలా మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఆయాలకు స్టౌల వినియోగం తెలియకపోవడంతో పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండడంతో గ్యాస్‌ సిలిండర్లతో వంట చేస్తున్నారని సమాచారం.

ఇండక్షన్‌ స్టౌలు వినియోగంపై అంగన్‌వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించాం. విద్యుత్‌ బిల్లులు కోసం ఒక్కో కేంద్రానికి నెలకు రూ.500 చొప్పున్న ప్రభుత్వం చెల్లిస్తోంది. ఒక్కో కేంద్రంలో విద్యుత్‌ వినియోగానికి నెలకు రూ.300 మాత్రమే అవుతుంది తప్ప ఎక్కువ కాదు. ఆ రూ.500ల్లో దాదాపు రూ.200 వరకు మిగులుతుంది. ఆ డబ్బులతో గ్యాస్‌ సిలిండర్‌ తీసుకుని విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే వంట చేయాలి. అయినా పూర్తిగా సమాచారం నాక్కూడా తెలియదు, తెలుసుకుని ఏం చేయాలో చెబుతాను.

– కేవీ బాలామణి, ఐసీడీఎస్‌ పీడీ, విజయనగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement