గరుగుబిల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురిసిన వర్షాలకు నాగావళినదికి ఒక్కసారిగా వరద ప్రవాహం వచ్చింది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తోటపల్లి ప్రాజెక్టువద్ద నీటి ప్రవాహం కాస్త తగ్గుముఖం పడుతూ స్థిరంగా ప్రవహిస్తోంది. నాగావళి నదిలో తోటపల్లి ప్రాజెక్టువద్ద ఆదివారం సాయంత్రానికి 105 మీటర్ల లెవెల్‌కుగాను 104.20 మీటర్ల లెవెల్‌లో నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం నదిపై భాగం నుంచి ప్రాజెక్టుకు 9,654ల క్యూసెక్కుల నీరు రాగా అధికారులు స్పిల్‌వే నుంచి 9,982 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెడుతున్నారు. కాలువల ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 2.53 టీఎంసీలకుగాను 2.026 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితిని ఏఈ కిషోర్ పర్యవేక్షిస్తున్నారు.


