● పొంగి పొర్లుతున్న నాగావళి
● సాయన్న గెడ్డ ఉగ్రరూపం
● ముంపునకు గురైన పంటలు
సంతకవిటి: గోళ్లవలస వద్ద నీట మునిగిన పంట పొలాలు
సంతకవిటి/వంగర/రాజాం:
విజయనగరం జిల్లా వాసులకు వాన గండం తప్పింది. శుక్రవారం ఉదయం అక్కడక్కడ చిరుజల్లులు మినహా భారీ వర్షాలు కురవలేదు. అయితే, ఒడిశాలో కురిసిన వర్షాలకు వరద నీరు నదులకు పోటెత్తింది. నాగావళి, సువర్ణముఖి, వేగావతి నదులు ఉగ్రరూపం దాల్చడంతో తీర గ్రామాలతో పాటు వేలాది ఎకరాల్లోని పంట నీటమునిగింది. మొన్నటివరకు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు అనుకూలించలేదు. ఇప్పుడు వరద పంటలను ముంచెత్తడంతో రైతులు కన్నీరుపెడుతున్నారు.
● నాగావళి నది, సాయన్న గెడ్డలు ఉగ్రరూపం దాల్చడంతో సంతకవిటి మండంలోని జావాం, కొత్తూరు, రామచంద్రాపురం, రంగారాయపురం, పోతులజగ్గుపేట, వాసుదేవపట్నం గ్రామాల ప్రజల జనజీవనం స్తంభించింది. మాధవరాయపురం, కొండగూడేం, గోళ్లవలస, ఎస్.అగ్రహారం తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. 1991లో వచ్చినట్టుగా ఈ సారి వరద చుట్టుముట్టిందంటూ తీర గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
వరద గ్రామాల్లో చిక్కుకున్న అధికారులు
నాగావళి నది పొంగి పొర్లడంతో తహసీల్దార్ సుదర్శనరావు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, డీటీ మధు, ఎస్సై ఆర్ గోపాలరావు వరద గ్రామాల్లోనే చిక్కుకున్నారు. ఎంపీడీఓ కారు జావాం గ్రామ సమీపంలో వరదలో ఉండి పోవడంతో స్థానికులు వరదకు కొట్టుకు పోకుండా తాళ్ల సహాయంతో స్తంభానికి కట్టారు.
నారాయణపురం కుడి ప్రధాన కాలువకు గండ్లు
వరద నీరు ఎటూ వెళ్లేందుకు వీలు లేక పోవడంతో రంగారాయపురం వద్ద నుంచి ప్రారంభమైన నారాయణపురం కుడి ప్రధాన కాలువ ఇరువైపుల గట్లకు రంగారాయపురం, వాసుదేవపట్నం సమీపంలో అనేక చోట్ల గండ్లు పడ్డాయి. దీనితో ఒక్కసారిగా వరద నీరు కుడి ప్రధాన కాలువను దాటి రెండో వైపుకు ప్రవహించడంతో వాసుదేవపట్నం గ్రామాన్ని ఒక్కసారి వరద నీరు ముంచెత్తింది. జావాం గ్రామంలోని కర్నేన లక్ష్మీనారాయణమ్మ గుడిసిలోకి వరద నీరు చేరడంతో ఆమెను గ్రామస్థులు గమనించి బయటకు తీసుకు వచ్చి రక్షించారు. అదే గ్రామానికి చెందిన కొమరిపురి సీతారాం పూరిల్లు గోడ కూలింది. చిన్నయ్యపేట, వాసుదేవపట్నం, మందరాడ, కాకరాపల్లి, షాలీపేట, రామారాయపురం, చిత్తారిపురం, మేడమర్తి, తమరాం, మంతిన, బూరాడపేట, పోడలి తదితర గ్రామాల పరిధిలోని 6వేల ఎకరాలకుపైగా వరిపంటపొలాలు నీట మునిగిపోయాయి. వరదనీరు తగ్గాలంటూ ఎస్.అగ్రహారం గ్రామ మహిళలు గంగమ్మతల్లికి పూజలు చేశారు.
మడ్డువలసకు పోటెత్తిన నీరు
వంగర మండల పరిధిలోని మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. ఒడిశాలో కురిసిన భారీ వర్షాలకు సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి వరదనీరు ప్రాజెక్ట్‌కు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు వద్ద 64.60 మీటర్ల నీటిమట్టం నమోదైంది. రెండు నదులు నుంచి 30 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉండగా, ప్రాజెక్టు ఏడుగేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడిచిపెడుతున్నారు. నదీతీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు డీఈఈ పి.అర్జున్ వెల్లడించారు. వరదనీరు పోటెత్తడంతో వంగర మండలం సంగాంలో వెలసిన పవిత్ర సంగమేశ్వర స్వామి ఆల యం నీటమునిగింది.


