చీపురుపల్లి: ‘రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. పంటల సాగుకు సంబంధించి కనీస అంచనాలు సర్కారు వద్ద లేవు. దీంతో రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోవాల్సి వచ్చింద’ని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ, పీఏసీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను శుక్రవారం ఆయన పరిశీలించారు. చీపురుపల్లి మండలంలోని పేరిపి, పీకే.పాలవలస, పత్తికాయవలస గ్రామాల్లో పర్యటించారు. అక్కడ నష్టపోయిన అరటి, బొప్పాయి, మొక్కజొన్న పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు.
‘ఎల్లో’నినో ప్రభావంతో సాగుకు దూరం..
‘ఎల్లో’నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు సకాలంలో పంటలు సాగు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే, ఖరీఫ్ చివరి దశలో ఏదోలా పంటల సాగుకు ముందుకెళ్లిన రైతులకు తుపా ను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వాతావరణ పరిస్థితులు అంచనా వేసుకుని రైతులను అప్రమత్తం చేయడమే కాకుండా ప్రత్యామ్నాయ విధానం వైపు అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వం విఫలమైందని’ని సర్కారు తీరుపై బెల్లాన మండిపడ్డారు.
కరువు జిల్లాగా ప్రకటించాలి..
‘తుపాను కారణంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అందుకనే జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి. అరటి పంటకు రూ.2 లక్షలు, బొప్పాయికి రూ.3 లక్షలు పరిహారం ప్రకటించాల’ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నష్టాల ఊబిలోకి రైతులు..
‘ప్రకృతి వైపరీత్యాలు, చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులు సాగు చేసిన పంటలకు పెట్టుబడి కూడా పరిస్థితి నెలకొంది. దీంతో వారు ఆదాయం కోల్పోయి అప్పులు పాలై, నష్టాల ఊబిలోకి వెళ్లిపోతున్నారు. కూటమి ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని నిర్వీర్యం చేసింది. సర్కారు చెల్లించాల్సిన ప్రీమియం వాటా విడుదల చేయకపోవడంతో ఇటు రాష్ట్రంతోపాటు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బీమా రాకుండా పోయింది. కనీసం రైతులు బీమా ప్రీమియం చెల్లించాలని అనుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేశార’ని చంద్రబాబు ప్రభుత్వాన్ని బెల్లాన దుయ్యబట్టారు.
తాగునీటి తంటాలు..
‘మూడు రోజులుగా విద్యుత్ సరఫరా లేక చాలా గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. విద్యుత్, తాగునీరు వంటి మౌలిక అవసరాలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కూటమి ప్రభుత్వంలో డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ప్రజా శ్రేయస్సును పట్టించుకునే వారే లేరు. రాష్ట్రంలో అరెస్టులు, వేధింపులు తప్ప పరిపాలన లేదు. తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించేంత వరకు రైతులు తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంద’ని బెల్లాన చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, మండలాద్యక్షుడు మీసాల వరహాలనాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ దన్నాన జనార్దనరావు, గవిడి సురేష్, కోరాడ పృధ్వి, మీసాల రమణ, రెల్లి శివ, రెల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
తుపాను కారణంగా జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం
అరటికి ఎకరాకు రూ.2 లక్షలు,
బొప్పాయికి రూ.3 లక్షలు పరిహారం ఇవ్వాలి
పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం
నిర్వీర్యం చేసింది
తుపాను నష్టాలను పరిశీలించిన
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ‘బెల్లాన’


