రిపీట్‌ | - | Sakshi
Sakshi News home page

రిపీట్‌

Sep 26 2026 1:38 AM | Updated on Sep 26 2026 1:38 AM

చోరీ జైలు బెయిలు రిపీట్‌ పోలీసులకు దొరికిన 110 చోరీల రాంబాబు

చోరీ జైలు బెయిలు
పోలీసులకు దొరికిన 110 చోరీల రాంబాబు

శ్రీకాకుళం క్రైమ్‌ : ఒకటి కాదు రెండు కాదు దాదాపు 110 చోరీలకు పాల్పడిన వున్నా రాంబాబు మళ్లీ జిల్లా పోలీసులకు పట్టుబట్టాడు. ఇతడి స్వస్థలం విజయనగరం జిల్లా చీపురుపల్లి. విజయవాడ సిటీ, కృష్ణా, విశాఖపట్నం సిటీ, అనకాపల్లి, విజయనగరంలోనే కాక మన జిల్లాలో ఇతనిపై ఇప్పటికే 110 చోరీలకు సంబంధించి పాత కేసులు నమోదై ఉన్నాయి. జి.సిగడాంకు చెందిన గిడిజాల కోటేశ్వరరావుతో కలసి 32 చోరీల్లో 112 తులాల (కేజీపావు) బంగారాన్ని దోచేసి గత ఏడాది జనవరి 18న జేఆర్‌ పురం సీఐ ఎం.అవతారం బృందానికి పట్టుబడి జైలుకు వెళ్లాడు. తాజాగా జిల్లాలో మరో 10 చోరీ కేసుల్లో పాల్గొని అదే సీఐ అవతారం బృందానికి శుక్రవారం పట్టుబడటంతో అరెస్టయ్యి కటకటాల పాలయ్యాడు. నిందితుడైన రాంబాబు నుంచి రూ. 41,50,000 లు విలువ చేసే 1.29 కిలోల వెండి, 300 గ్రాముల బంగారం, రూ.2,62,000 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని గూనపాలెం సమీప సబ్‌డివిజనల్‌ కార్యాలయంలో డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద దీనికి సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు.

వివరాల్లోకి వెళ్తే..

ఈ ఏడాది ఆగస్టు 28న జి.సిగడాంకు చెందిన టంకాల సత్యనారాయణ తన భార్యతో కలసి బంధువుల ఫంక్షన్‌కు విజయవాడ వెళ్లగా ఆయన ఇంటిలో చోరీ జరిగింది. సీఐ ఎం.అవతారం దర్యాప్తు చేపట్టి ఈనెల 24న జి.సిగడాం మండలం నడిమివలస జంక్షన్‌ వద్ద ఎస్‌ఐ అప్పలసూరి, సిబ్బందికి రాంబాబు చిక్కడంతో అదుపులోకి తీసుకున్నారు. సీఐ అవతారం విచారణ చేయగా అనేక విషయాలు బయటపడ్డాయి.

రాంబాబు రూటే సెపరేటు..

పగటి పూట తాళం వేసిన ఇళ్లను రాంబాబు టార్గెట్‌ చేస్తాడు. ఇంటి వద్ద దాచే తాళాలనే తీసి ఇంట్లోకి చొరబడతాడు. ఇంట్లో వారికి అనుమానం రాకుండా ఒకటి రెండు వస్తువులకు (నాలుగైదు తులాలకు) మించి చోరీ చేయడు. ఇంటి దొంగ చేసిన పనిగా క్రియేట్‌ చేసి వారిలో వారే కొట్టుకునేటట్లు చేస్తాడు. ఎక్కడా వేలి ముద్రలు పడకుండా జాగ్రత్త పడతాడు.

క్రికెట్‌ మోసానికి గురై..

ఇంటర్‌ వరకు చదివిన రాంబాబుకు మొబైల్‌ అప్లికేషన్లు, హార్డ్‌వేర్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానంలో ప్రావీణ్యముంది. చిన్నప్పటినుంచి క్రికెట్‌పై మక్కువ ఉండటంతో విజయవాడలో తన అత్తగారింటి వద్దనున్నప్పుడు అక్కడి కోచ్‌ వద్ద మెలకువలు నేర్చుకున్నాడు. రంజీ జట్టు ఎంపిక విషయంలో కోచ్‌ మోసం చేయడంతో తట్టుకోలేక వ్యసనాల బాట పట్టాడు. క్రికెట్‌ బెట్టింగ్‌ కోసం డబ్బులు దుబారాగా ఖర్చుపెట్టేవాడు. చోరీ చేసిన ఆభరణాలను తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని అబద్ధాలు చెప్పి స్నేహితులకు చెప్పి వారి ద్వారా బ్యాంకుల్లోనూ, ఫైనాన్స్‌ కంపెనీల్లో తాకట్టుపెట్టి డబ్బును పొందేవాడు.

జైలుకు వెళ్లడం.. బెయిల్‌పై రావడం

2018 జనవరి 18న కోటేశ్వరరావుతో కలిసి పట్టుబడి అరైస్టె జైలుకు వెళ్లిన రాంబాబు బెయిల్‌పై విడుదలైన కొన్ని నెలలకే విజయవాడ సిటీ పరిధిలో జరిగిన చోరీల కేసులో పట్టుబడి జైలుకు వెళ్లాడు. మళ్లీ బెయిల్‌పై విడుదలై విశాఖపట్నం జిల్లా ఆనందపురంలో చోరీల కేసులో జైలుకు వెళ్లాడు. అక్కడా బెయిల్‌ పొంది విజయనగరం బొబ్బిలి పోలీసులకు చోరీల కేసులో పట్టుబడి చివరిసారిగా జైలుకెళ్లాడు. ఈ ఏడాది జులైలో విడుదలైన రాంబాబు మళ్లీ చోరీల బాట పట్టి సీఐ అవతారం సమక్షంలోని జె.ఆర్‌.పురం, సిగడాం పోలీసులకు పట్టుబడ్డాడని, నిందితున్ని రిమాండ్‌కు తరలిస్తున్నామని డీఎస్పీ వివేకానంద వెల్లడించారు.

తాజా కేసులివే..

జి.సిగడాం 2 కేసులు, జె.ఆర్‌.పురం 3, కోట బొమ్మాళి 2, సారవకోట, ఆర్‌.ఎ.వలస (విజయనగరం), నరసన్నపేటల్లో ఒక్కొక్కటి చొప్పున కేసుల్లో నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి పూర్తిస్థాయిలో సొత్తును రికవరీ చేయడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement