ఎస్టీఓ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్టీఓ సస్పెన్షన్‌

Sep 26 2026 1:38 AM | Updated on Sep 26 2026 1:38 AM

● నూతన ఎస్టీఓగా నూకరాజు

బొబ్బిలి: బొబ్బిలి ఉపఖజానాధికారి పీవీ పద్మనాభంపై సస్పెన్షన్‌వేటు పడింది. పలు ఉపా ధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు ఎస్టీఓ పనితీరు సక్రమంగా లేదని, లంచాలు అడుగుతున్నారని ఖజానా శాఖ జిల్లా అధికారికి, డైరెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. ఆ మేరకు ఆయనపై సస్పెన్షన్‌ ఉత్తర్వులు వెలువడినట్టు జిల్లా ఖజానాధికారి నాగమహేష్‌ తెలిపారు. ఆయన స్థానంలో జిల్లాకేంద్రం నుంచి ఎం.నూకరాజును ఉన్నతాధికారులు నియమించారు. దీంతో ఆయన శుక్రవారం విధుల్లో చేరారు. ఆయనకు వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులు కురమాన జోగారావు, ఎస్‌.శ్రీనివాసరావు, సీహెచ్‌ సురేష్‌, పి.సింహాచలం, తిరుపతిరావు, తదితరులు స్వాగతం పలికారు.

ఎస్‌డబ్ల్యూఎఫ్‌ మౌన ప్రదర్శన

విజయనగరం క్రైమ్‌: ఆర్టీసీ సంస్థ నిబంధనలను తుంగలోకి తొక్కి.. సంస్థకు నష్టం చేకూర్చుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) శుక్రవారం ఆందోళన చేసింది. విజయనగరం ఆర్టీసీ డిపో ఎదుట మౌన ప్రదర్శన నిర్వహించింది. నచ్చిన వారికే ప్రత్యేక డ్యూటీ లు వేస్తున్నారని ఆరోపించింది. నిరసన ప్రదర్శనలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నాయకులు లక్ష్మి, చంద్రయ్య, పద్మావతి, బి.ఎస్‌.రావు పాల్గొన్నారు.

విధుల్లో నిర్లక్ష్యంపై కలెక్టర్‌ ఆగ్రహం

● వంగర తహసీల్దార్‌తో పాటు ఇద్దరు రెవెన్యూ సిబ్బందిపై వేటు

వంగర: తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహించడంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది అలసత్వం వహించడంపై కలెక్టర్‌ ఎం.రాంసుందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ముంపు ప్రాంతాల్లో సకాలంలో పర్యటించి, వరద బాధితులకు సాయం అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి బాధ్యులుగా వంగర తహసీల్దార్‌ పిన్నింటి రామారావుతో పాటు సంగాం వీఆర్వో ఉప్పాడ రామచంద్రరావు, వంగర వీఆర్‌ఏ కొప్పర ఉదయ్‌కిరణ్‌లను సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. సువర్ణముఖి నది నుంచి భారీగా వరదనీరు రావడంతో కొండచాకరాపల్లి, కొప్పర, గీతనాపల్లి గ్రామాలు ముంపునకు గురయ్యాయి. విషయాన్ని తహసీల్దార్‌కు తెలియజేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయా గ్రామాల ప్రజలు కలెక్టర్‌ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన చర్యలు తీసుకున్నారు. వంగర రీసర్వే డీటీగా పనిచేస్తున్న రుంకాన శ్రీనివాసరావును ప్రస్తుతం వంగర ఎఫ్‌ఏసీ తహసీల్దార్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

చట్టాలపై అవగాహన అవసరం

● జిల్లా అడిషినల్‌ సెషన్స్‌ జడ్జి అప్పలస్వామి

చీపురుపల్లి: చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని జిల్లా అడిషినల్‌ సెషన్స్‌ జడ్జి బి.అప్పలస్వామి అన్నారు. చీపురుపల్లి పట్టణంలోని జి.అగ్రహారంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చట్టాలకు వ్యతిరేకంగా ఎవరూ వ్యవహరించకూడదన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందించేందుకు ఉచిత న్యాయసేవాధికార సంస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వివాదాలజోలికి వెళ్లి కాలాన్ని వృథా చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికారి ఎ.కృష్ణప్రసాద్‌, చీపురుపల్లి కోర్టు సివిల్‌ జడ్జి పి.బుజ్జి, తహసీల్దార్‌ సంతోష్‌, సీఐ జి.శంకరరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement