ముగియనున్న పదవీకాలం | - | Sakshi
Sakshi News home page

ముగియనున్న పదవీకాలం

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

విజయనగరం రూరల్‌: స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ఒకటి రెండు రోజుల్లో ముగియనుండడంతో జిల్లా పరిషత్‌తో సహా మండల పరిషత్‌లు ప్రత్యేక అధికారుల పాలనలోకి రానున్నాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసి సుమారు 6 నెలలు గడిచిపోయి ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఈ నెల 23న మండల పరిషత్‌ పాలకవర్గాల (ఎంపీపీ, ఎంపీటీసీలు) పదవీకాలం ముగియనుండగా, ఈ నెల 24న జెడ్పీ పాలకవర్గం పదవీకాలం పూర్తికానుంది. 2021లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తొలుత పంచాయతీలకు మార్చిలో ఎన్నికలు నిర్వహించగా, సెప్టెంబర్‌ నెలలో మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించగా పాలకవర్గాలు ఏర్పడ్డాయి. దీంతో 5 ఏళ్ల అనంతరం స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం పూర్తయింది.

చంద్రబాబు సర్కారు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమని చెప్పి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించడం, ఆ దిశగా ఎన్నికల కమిషన్‌ అధికారులకు ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాల జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు గడిచిన రెండు నెలలుగా ఈ ప్రక్రియపై కసరత్తు పూర్తి చేశారు. అయితే ఒకవైపు సర్‌ ప్రక్రియ కొనసాగుతుండగా, మరోపక్క 2021 ఓటర్ల జాబితాను అనుసరించి ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం చెబుతోంది. అలాగే రిజర్వేషన్ల ప్రక్రియ ఒక కొలిక్కి రాకపోవడంతో ఈసారైనా స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరుగుతాయా? అనే సందేహం ప్రజల్లో నెలకొంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించిన దాఖలాలు ఎప్పుడూ లేవని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జెడ్పీగా విజయనగరం

గత ఐదేళ్ల నుంచి పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలోని 34 మండలాలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలతో ఉమ్మడి జిల్లా పరిషత్‌ పాలకవర్గంగా ఉన్న విజయనగరం జిల్లా పరిషత్‌ ఈ నెల 25 నుంచి 27 మండలాలతో కొనసాగనుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 27 మండలాల నుంచి ఎన్నికై న జెడ్పీటీసీలు, ఎంపీపీలు సభ్యులు జిల్లా పరిషత్‌లో సభ్యులు కానున్నారు. ఎంపీపీలు, ఎంపీటీసీలు గురువారం నుంచి తాజా మాజీలు కానుండగా, జెడ్పీ చైర్మన్‌తోపాటు జెడ్పీటీసీ సభ్యులు ఈ నెల 25 నుంచి తాజా మాజీలు కానున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఈనెల ఐదో తేదీనే ఆదేశాలిచ్చిన ప్రభుత్వం, ఈ నెల 25 నుంచి కొత్త జెడ్పీల కార్యకలాపాలు ప్రారంభించాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై విజయనగరం జిల్లాలో 27 మండలాలకు సంబంధించి ఎంపీటీసీ స్థానాలు 449 ఉండగా, గ్రామ పంచాయతీలు 777 ఉన్నాయి. ఓటర్లు 12 లక్షల 85 వేల 704 మంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement