● మరో డ్రైవర్, ఇద్దరు క్లీనర్‌లకు గాయాలు
దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి–మరడాం మధ్యలో జాతీయ రహదారిపై మంగళవారం తెల్ల వారు జామున ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో బిహార్‌కు చెందిన టిప్పర్ డ్రైవర్ రవీంద్రకుమార్ యాదవ్ లారీ క్యాబిన్‌లో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై పెదమానాపురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గజపతినగరం నుంచి రామభద్రపురం వైపు యూరియా లోడ్‌తో వెళ్తున్న లారీని బొబ్బిలి నుంచి గజపతినగరం వైపు వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో బిహార్‌కు చెందిన టిప్పర్ డ్రైవర్ రవీంద్రకుమార్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందారు. బిహర్‌కు చెందిన టిప్పర్ క్లీనర్ బబ్లూ కుమార్‌గౌడ, విశాఖ జిల్లా వేపగుంటకు చెందిన లారీ డ్రైవర్ రాయి వెంకటేష్, విజయనగరం జిల్లా బొండపల్లికి చెందిన లారీ క్లీనర్ ముత్యాలనాయుడులకు గాయాలయ్యాయి, గాయాల పాలైన వారిని గజపతినగరం సామాజిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం మహరాజా ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న బొబ్బిలి డీఎస్సీ గోవిందరావు, గజపతినగరం సీఐ సన్యాశినాయుడు సంఘటనా స్థలానికి వచ్చి ట్రాఫిక్ దగ్గరుండి క్లియర్ చేసి గాయ పడ్డవారిని చికిత్స కోసం తరలించారు.మృతదేహానికి పోస్ట్ మార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్సై చెప్పారు.


