ఓటు హక్కు పరిరక్షణకు ఐక్య పోరాటం | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు పరిరక్షణకు ఐక్య పోరాటం

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

ఓట్ల తొలగింపుపై సీపీఐ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు ధ్వజం

విజయనగరం గంటస్తంభం: ప్రజాస్వామ్యంలో పౌరుడికి అత్యంత విలువైన ఓటు హక్కు పరిరక్షణకు ప్రజాస్వామ్యవాదులంతా ఐక్య కార్యాచరణతో ముందుకు రావాలని సీపీఐ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం స్థానిక డీఎన్‌ఆర్‌ అమర్‌ భవన్‌లో జిల్లా సీపీఐ కార్యదర్శి ఒమ్మి రమణ అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) ముసుగులో దేశవ్యాప్తంగా లక్షలాది ఓట్లను తొలగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికే 44 లక్షల ఓట్లను తొలగించారని, మరో 42 లక్షల మందికి చిన్నపాటి అక్షర దోషాల పేరిట నోటీసులు జారీ చేయడం దారుణమన్నారు. విజయనగరం జిల్లాలోనే ఏకంగా 1,93,735 ఓట్లను తొలగించడం శోచనీయమన్నారు. కేంద్రంలోని బీజేపీ, కూటమి వర్గాలు ప్రతిపక్షాలను, మైనార్టీల ఓట్లను లక్ష్యంగా చేసుకుని గల్లంతు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేవలం చనిపోయినవారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి వివరాలను మాత్రమే మినహాయించి, మిగిలిన అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును యథాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఓట్ల తొలగింపు గందరగోళంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెంటనే స్పష్టతనివ్వాలని కోరారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.రంగరాజు, సీపీఐ సహాయ కార్యదర్శులు బుగత అశోక్‌, అలమండ ఆనందరావు, ప్రజా సంఘాల నేతలు కె.స్రవంతి, ఖండిపల్లి భీముడు, పురం అప్పారావు, యు.నీలకంఠేశ్వర యాదవ్‌, సుమన్‌, రామచంద్రరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement