విద్యుదాఘాతానికి ఒకరి బలి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి ఒకరి బలి

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

గజపతినగరం రూరల్‌ (జామి): జామి మండలంలోని అలమండ గ్రామంలో విద్యుత్‌ షాక్‌కు గురై ఓ వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసుల కథనం ప్రకారం, అలమండ గ్రామంలోని వినాయక మంటపం వద్ద విద్యుత్‌ పనులు చేస్తున్న ఎలక్ట్రీషియన్‌ ఎస్‌.గౌరునాయుడు (35) విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే తుదిశ్వాస విడిచాడు. మృతుడు గౌరు నాయుడుకి భార్య రమ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఎస్‌.కోట ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బొటానిక్స్‌ మేనేజర్‌పై

కేసు నమోదు

పూసపాటిరేగ: భోగాపురం మండలం అక్కివరం జంక్షన్‌ సమీపంలో గల బొటానిక్స్‌ కంపెనీ మేనేజర్‌పై యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు భోగాపురం సీఐ కె.దుర్గాప్రసాద్‌ తెలియజేశారు. కంపెనీలో మేనేజరుగా పని చేసిన చోడవరపు ధనుంజయ ఆగస్టు 31 వ తేదీన కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లు, కొంత నగదు పట్టుకుని చెప్పకుండా వెళ్లిపోయి యాజమాన్యానికి నష్టం కలిగించాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలియజేశారు. దీనిపై విచారణ చేసిన భోగాపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

తోటపల్లి కాలువలో వ్యక్తి గల్లంతు

కొనసాగుతున్న గాలింపు

సీతానగరం: మండలంలోని ఏగోటివలసలో గల తోటపల్లి కాలువలో పడి కృష్ణాజిల్లా ఉయ్యూరు దరి లెంక గ్రామానికి చెంది మధుకోటి హేమంత్‌ కృష్ణ మంగళవారం గల్లంతయ్యాడు. దీనిపై స్థానికులు అందించిన వివరాల ప్రకారం..ఏగోటివలస గ్రామానికి చెందిన ఎస్‌.పోలినాయుడు, గల్లంతైన హేమంత్‌ కృష్ణ స్నేహితులు. వారిద్దరూ ఒక ప్రైవేట్‌ కంపెనీలో సెక్యూరిటీ విభాగంలో పని చేస్తున్నారు. మంగళవారం పోలినాయుడు ఇంట్లో కుమార్తె బాలసారె కార్యక్రమానికి హేమంత్‌ కృష్ణను ఆహ్వానించాడు. సోమవారం రాత్రి ఏగోటివలస గ్రామానికి చేరుకున్న హేమంత్‌ కృష్ణ మంగళవారం ఉదయం బహిర్భూమితో పాటు స్నానం కోసం గ్రామాన్ని ఆనుకుని ఉన్న తోటపల్లి కాలువ దగ్గరకు వచ్చాడు. అక్కడ కాలకృత్యాలు తీర్చుకుంటుండగా హేమంత్‌ కృష్ణ(39) ప్రమాదవ శాత్తు కాలువలో జారిపడి గల్లంతయ్యాడు. వెంటనే గ్రామస్తులు కాలువలో దిగి గల్లంతైన వ్యక్తిని వెతకడం ప్రారంభించారు. అప్పటికే ఎడతెరిపి లేని వర్షం పడుతుండడంతో వెతకడం కష్టంగా మారింది. అనంతరం పోలీసులు, ఫైర్‌సిబ్బంది కాలువలో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సంఘటనా స్థలానికి తహసీల్దార్‌ ఎం.ప్రసన్నకుమార్‌, ఎంపీడీఓ ఎంఎల్‌ఎన్‌ ప్రసాద్‌, ఎస్సై ఎం.హేమలత చేరుకుని వివరాలు అడిగి తెలుసుకుని గల్లంతైన వ్యక్తిని గుర్తించడానికి చర్యలు చేపట్టారు.కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ కె కుమారవర్మ, ఆర్‌ఐ ఎన్‌ శ్రీనివాసరావు వీఆర్వో ఆనందరావు పాల్గొన్నారు. ఇంకా గాలింపు సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement