ప్రజలకు అండగా పీజీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు అండగా పీజీఆర్‌ఎస్‌

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

పెండింగ్‌ లేకుండా గడువులోగా అర్జీలు పరిష్కరించాలి

కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి

పార్వతీపురం రూరల్‌: పోలీసు–ప్రజల మధ్య పరస్పర విశ్వాసం బలోపేతం చేయడంతో పాటు, సమస్యలకు సత్వర పరిష్కారం చూపడమే ప్రధాన ఉద్దేశమని ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు ఎస్పీని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఆస్తి తగాదాలు, భూవివాదాలు, కుటుంబ కలహాలు, మోసాలు, వేధింపులు తదితర సమస్యలపై ఈ కార్యక్రమంలో మొత్తం 14 వినతులు అందాయి. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ.. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా ఠాణాల అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదులపై చట్టనిబంధనల ప్రకారం నిష్పక్షపాతంగా విచారణ జరిపి, అర్హులకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్‌బీ సీఐ జీఏవీ రమణ, ఎస్సై శిరీష తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 31 వినతులు

సీతంపేట: ఐటీడీఏలో సోమవారం ప్రాజెక్ట్‌ అధికారి పవార్‌ స్వప్నిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 31 వినతులు వచ్చాయి. మండలంలోని అడ్డంగి నుంచి అబలాసింగి వరకు రహదారి మరమ్మతులు చేపట్టాలని గిరిజనులు కోరారు. కుసుమూరుకు చెందిన దేవి తనకు ఆశ వర్కర్‌ పోస్ట్‌ ఇప్పించాలని కోరింది, ఆంపూర్‌కు చెందిన గిరిజనులు ఫవర్‌ వీడర్‌ తమ గ్రామానికి ఇప్పించాలని విన్నవించారు.తమ భూమికి పొజిషన్‌ సర్టిపికెట్‌ ఇప్పించాలని నారాయణగూడకు చెందిన గణేష్‌ వినతి ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

పార్వతీపురం: పీజీఆర్‌ఎస్‌ ద్వారా అందే ప్రతి అర్జీపై అధికారులు బాధ్యతగా స్పందించి, నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. అర్జీ స్వీకరణ నుంచి సమస్య పరిష్కారం వరకు జిల్లా యంత్రాంగం ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇవ్వాలన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో ప్రజలనుంచి కలెక్టర్‌ 132 దరఖాస్తులు స్వీరించారు. ఇందులో 97 సాధారణ దరఖాస్తులు కాగా, 35 రెవెన్యూకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అవసరమైన పరిశీలన చేపట్టి, నిబంధనల మేరకు సాధ్యమైనంతవరకు త్వరగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. అర్జీని పరిష్కరించినట్లు కేవలం ఆన్‌లైన్‌లో నమోదు చేయడం కాకుండా, అర్జీదారు సమస్యకు వాస్తవికంగా పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి అర్జీ పురోగతిని అధికారులు నిరంతంర పర్యవేక్షించాలని, ప్రజలకు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మెరుగైన సేవలు అందించాలన్నారు.

సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement