మెరకముడిదాం: పండగలు వేళ ఇంట్లో తీపి తిందామంటే ధరలు చేదు అనుభూతిని మిగుల్చుతున్నాయి. వంటింట్లో నిత్యావసరమైన పంచదార ధర పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. ప్రస్తుతం పండగలు, వ్రతాలు, శుభకార్యాల సీజన్ కావడంతో వాటి వినియోగం పెరిగి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రిటైల్ మార్కెట్‌లో జూలై నెలాఖరు నాటికి కిలో పంచదార 45 రూపాయలు ఉండగా..ప్రస్తుతం ఈ ధర రూ.75కు చేరింది. ఈనెల ప్రారంభం నుంచి ధరలు మరింత పెరుగుతున్నాయి. 22 రోజుల్లోనే కిలోకు 30 రూపాయలు వరకూ పెరగడం, షాక్‌కు గురిచేస్తోంది. ఒక కుటుంబం సగటున నెలకు 5 కిలోల పంచదారను వినియోగిస్తే సుమారు రూ.150 అదనపు భారం కానుంది. జిల్లాలో చక్కెర వినియోగంలో 35 శాతం వరకూ మాత్రమే ఇళ్లలో ఉండగా , మిగిలిన 65 శాతం హోటళ్లు, బేకరీలు, స్వీట్‌షాపులు, కేటరింగ్ వ్యాపారాలు, డ్రింక్స్, ఫాస్ట్‌పుడ్ తయారీ యూనిట్లలో వినియోగిస్తున్నారు.
ధర మరింత పెరిగే అవకాశం
ఆగస్టు నుంచి నవంబరు వరకు పండగల సీజన్ కావడంతో పంచదారకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ధరలు పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. దీశీయ మార్కెట్‌లో సరఫరా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా 10 లక్షలు టన్నుల ముడిచక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. అది సత్ఫలితాలను ఇస్తే ధరలు అదుపులోకి రావొచ్చని అంటున్నారు.
అదేబాటలో బెల్లం
పంచదార ధరల పెరుగుదల బాటలో బెల్లం కూడా పయనిస్తోంది. ప్రస్తుతం రూ.70 నుంచి రూ.100 వరకు నాణ్యతను బట్టి బెల్లం ధర ఉంది. ఆర్గానిక్, ప్యూర్ చెరకు, ప్రముఖ బ్రాండ్‌ల బెల్లం ధరలు మరింత భగ్గుమంటున్నాయి. నాణ్యమైన ఆర్గానిక్ బెల్లం కిలో రూ.100కు పైగా ఉంది. పంచదార, బెల్లంతో పాటూ బియ్యం, నూనెలు, ధనియాలు, పప్పులు, ఉల్లిపాయలు తదితర నిత్యావసర ధరలు పెరుగుతుండడం సామాన్యుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నిత్యావసర ధరలు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం వెంటనే వాటిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
ౖపైపెకి ఎగబాకుతున్న ధరలు
నెలరోజుల్లో కిలోకు రూ.30 వరకూ పెరుగుదల
రానున్నరోజుల్లో మరింత పెరిగే అవకాశం
అదేబాటలో బెల్లంధరలు
టీషాపులు, స్వీట్స్‌షాపులు,
బేకరీలు, హోటళ్ల వ్యాపారంపై ప్రభావం


