● నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
● చికిత్స పొందుతున్న బాధితురాలు
గరుగుబిల్లి: మండలంలోని కొట్నాన రామినాయుడువలస గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా వంట చేసుకుంటున్న కోడి గౌరమ్మ (భర్త దివంగత రేగం నాయుడు)పై అదే గ్రామానికి చెందిన బంకురు శ్రీనివాసరావు దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. గౌరమ్మ కుమారుడు విజయనగరంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండడంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. మద్యం మత్తులో ఉన్న శ్రీనివాసరావు ఆమె ఇంట్లోకి వెళ్లి గౌరమ్మ మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాగేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించడంతో.. ఆగ్రహించిన నిందితుడు సుత్తితో ఆమె తలపై పలుమార్లు కొట్టడంతో తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. గౌరమ్మ కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె కేకలు విన్న గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని అంబులెన్‌న్స్‌కు సమాచారం అందించారు. అనంతరం గాయపడిన గౌరమ్మను పార్వతీపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గరుగుబిల్లి పోలీసులు నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఫకృద్దీన్ తెలిపారు.


