బొండపల్లి: విజయనగరాన్ని తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దరాజు రాంబాబు సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా తీవ్ర కరువు పరిస్థితులు నెలకున్నాయన్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 30 శాతానికి మించి వరి సాగు జరగలేద న్నారు. వర్షాలు కురవకపోవడంతో మొట్ట భూముల్లోని పంటలు ఎండిపోతున్నాయన్నారు. కరువు పరిస్థితుల్లో రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలతో పాటు, సాగుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమన్వయంతో సేవలందించాలి
విజయనగరం గంటస్తంభం: ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలను సత్వరంగా, పారదర్శకంగా అందించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్షించారు. ప్రజల ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, ప్రభుత్వ సేవలపై విశ్వాసం పెంచాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుత వారానికి ఓవరాల్ పాజిటివ్ స్కోర్ 69.93 శాతంగా నమోదైన నేపథ్యంలో తక్కువ సానుకూలత ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఎస్.సేతుమాధవన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
దళారులను నమ్మొద్దు
విజయనగరం గంటస్తంభం: ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ఈ నెల 16 వరకు దర ఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, ఈకేవైసీ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. వృద్ధు లు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, మత్స్యకారులు, డప్పు కళాకారులు, చెప్పుల తయారీదారులు, కల్లు గీత కార్మికులు, ట్రాన్స్‌జెండర్లు అర్హత మేరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పింఛన్ రకాన్ని బట్టి అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించాలని సూచించారు. అర్హులకు పింఛన్లు మంజూరవుతాయని, దళారులను నమ్మవద్దని, వివరాలకు డీఆర్డీఏ కార్యాలయం 80082 03971ను సంప్రదించాలని కోరారు.
వీబీవైఎల్‌డీ–2027కు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం గంటస్తంభం: దేశాన్ని–2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యువ నాయకుల సంభాషణ కార్యక్రమానికి (వీబీవైఎల్‌డీ–2027) 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న యువత దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన అధికారి ప్రేమ్‌భరత్‌కుమార్ కోరారు. క్విజ్, వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాసం, యువ పార్లమెంట్, ఆవిష్కరణలు, తదితర విభాగాల్లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఆసక్తి ఉన్న యువత మై భారత్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కోరారు.
12న కోడూరు మాత పండగ
బాడంగి: బాడంగి మండలం కోడూరు లో వెలసిన కోడూరుమాత ఉత్సవం ఈ నెల 12న నిర్వహించేందుకు ఏర్పా ట్లు చురుగ్గా సాగుతున్నాయి. కులమ తాలకు అతీతంగా సాగే పంగడలో పాల్గొనేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు, ఆరాధకులు తరలివస్తారు. స్వస్థత చేకూర్చే మాతగా కోడూరు మాతను ఆరాధిస్తారు. భక్తుల రాకపోకలకు వీలుగా ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాలూరు, పార్వతీపురం, రాజాం, పాలకొండ డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. పండగలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు బొబ్బిలి డీఎస్పీతో పాటు సీఐ, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. పండగను విజయవంతం చేయాలని రెవ,ఫాదర్ పీటర్ సింహాచలం భక్తులను కోరారు.


