అల్లిపురం: రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్య మత్స్యకార కుటుంబం వారిది. కష్టాల కడలిని ఈదుతూ నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు పొరుగు జిల్లా నుంచి వలసొచ్చిన ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. రాత్రి ‘బయటకు వెళ్లి వస్తా’నని చెప్పి వెళ్లిన వ్యక్తి.. తెల్లవారేసరికి సముద్రతీరంలో విగతజీవిగా కనిపించడంతో భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
సముద్రపు ఒడ్డున రక్తపు మడుగులో..
వన్ టౌన్ సీఐ వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన మైలపల్లి చంటి(30) కొంతకాలంగా విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో చేపలవేట చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య, పిల్లలతో కలిసి స్థానిక పెయిన్‌దొరపేటలో నివాసం ఉంటున్నాడు. వారం రోజులుగా వేటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న చంటి, ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో బయటకు వెళ్లాడు. సోమవారం ఉదయం నేవల్ కోస్టల్ బ్యాటరీ సమీపంలోని గంగాలమ్మ గుడి వద్ద రక్తపు మడుగులో కనిపించాడు. చంటిని గుర్తించిన స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు అతడి తలపై కర్రలతో బలంగా కొట్టి, మెడకు నైలాన్ తాడు బిగించి అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ముందే ఊహించినా.. దక్కని ప్రాణం
ఈ దారుణం వెనుక పక్కా ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు వ్యక్తులు తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఆదివారమే చంటి తన సోదరి అప్పలకొండ వద్ద వాపోయాడు. అంతలోనే.. హత్యకు గురికావడం ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ బెదిరింపులకు పాల్పడినవారే ఈ ఘాతుకానికి ఒడిగట్టారా? లేక మరేదైనా వివాదం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడి సోదరి అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌లతో ఘటనా స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు. నిందితులను గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.
మైలపల్లి చంటి(ఫైల్)
చెప్పిన కొన్ని గంటల్లోనే శవమైన తమ్ముడు
హార్బర్ సమీపంలో మత్స్యకార
యువకుడి మృతదేహం
తల పగలగొట్టి, మెడకు తాడు బిగించి కిరాతకం


