చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు | - | Sakshi
Sakshi News home page

చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు

Sep 8 2026 1:05 AM | Updated on Sep 8 2026 1:05 AM

విజయనగరం టౌన్‌: చట్టాన్ని ఉల్లంఘించి దుశ్చర్యలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ హెచ్చరించారు. భోగాపురం మండలం రామచంద్రరాజుపేట గ్రామానికి చెందిన ఎల్లా రాజేష్‌ అనే వ్యక్తిని బైకు డబ్బులివ్వలేని కారణంతో నిర్భందించి, హింసించి, తాళ్లతో చేతులు కట్టేసి, మెడలో తాడువేసి వీధుల్లో తిప్పిన ఘటనను జిల్లా పోలీసుశాఖ తీవ్రంగా పరిగణించిందన్నారు. దీనికి బాధ్యులైన ఐదుగురు నిందితులపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్లతో కేసు నమోదుచేసి, నిందితులను అరెస్టు చేసి, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం కేసు వివరాలను వెల్లడించారు.

ఎల్లా రాజేష్‌ లారీ క్లీనర్‌గా పనిచేస్తూ, అతని స్నేహితుడైన వెన్ను మహేష్‌ (ఎ2) వద్ద బైక్‌ను రూ.10వేలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇద్దరూ స్నేహితులు కావడంతో డబ్బులు చెల్లించకుండానే బైక్‌ను రాజేష్‌కు ఇచ్చాడు. ట్రయల్‌ వేసే క్రమంలో ఒక కారును బైక్‌తో ఢీకొట్టారు. కారు డామేజ్‌ కావడంతో కారు రిపేర్‌ చేసేందుకు మెకానిక్‌ లెంక శ్రీరామ్‌ (ఎ1) అనే వ్యక్తి బాధ్యత వహించడంతో సమస్య సద్దుమణిగింది. అప్పటి నుంచి రాజేష్‌ రూ.30వేలు చెల్లించాలని శ్రీరామ్‌ డిమాండ్‌ చేయడం, రాజేష్‌ ఆ విషయాన్ని దాటవేస్తూ కాలయాపన చేయడం, తప్పించుకుని తిరగడం చేస్తుండేవాడు. ఈ నెల 5న సాయంత్రం సుందరపేట గ్రామ కూడలి వద్ద ఉన్న రాజేష్‌ను భోగాపురానికి చెందిన బైక్‌ మెకానిక్‌ వెన్ను మహేష్‌ (ఎ2), గొల్లపేటకు చెందిన బమ్మిడి వెంకటరమణ అలియాస్‌ మహేష్‌ (ఎ3) కలిసి బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని, స్కూల్‌ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడకు లెంక శ్రీరామ్‌ (ఎ1) చేరుకుని రాజేష్‌ను డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డబ్బులు చెల్లించలేనని రాజేష్‌ తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు. దీంతో మెకానిక్‌ షెడ్‌కు తీసుకువెళ్లి నమ్మి గోవింద్‌ (ఎ4), వెన్ను అప్పారావు (ఎ5)ల సాయంతో రాత్రంతా మెకానిక్‌ షెడ్‌లోనే నిర్బంధించి, కొట్టి, డబ్బులు రాబట్టేందుకు రాజేష్‌ బంధువులతో మంతనాలు జరిపారు. రాజేష్‌ బంధువులు కూడా ఆ డబ్బులు చెల్లించేందుకు ఆసక్తి కనబరచకపోవడంతో ఈ నెల 6న నిందితులిద్దరూ రాజేష్‌ షర్ట్‌ విప్పించి, చేతులను తాళ్లతో కట్టి, మెడలో తాడు వేసి, భోగాపురం వీధుల్లో తిప్పి అమానుషంగా ప్రవర్తించారు. విషయం తెలుసుకున్న జిల్లా పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. నిందితులను అరెస్టు చేసి హత్యాయత్నం, అట్రాసిటీ చట్టం సెక్షన్‌లతో భోగాపురం ఇన్‌చార్జి సీఐ ఎన్‌.శ్రీనివాసరావు కేసు నమోదుచేశారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ ఎం.వీరకుమార్‌, విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్‌.రాఘవులు, భోగాపురం రూరల్‌ సీఐ ఎన్‌.శ్రీనివాసరావు, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ ఎ.వి.లీలారావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఎస్పీ దామోదర్‌

యువకుడిని తాళ్లతో కట్టి, వీధుల్లో

నడిపించడం తీవ్రమైన నేరం

నిందితులపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్లతో కేసు నమోదు

ఐదుగురు నిందితులు అరెస్ట్‌,

రిమాండ్‌కు తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement