సాక్షి, పార్వతీపురం మన్యం:
గురుపూజోత్సవం (సెప్టెంబర్ 5) సందర్భంగా పాఠశాల విద్యా శాఖ ప్రకటించిన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికపై వ్యాయామ ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను పాఠశాల స్థాయి నుంచే ఇష్టమైన క్రీడారంగంలో సానబెట్టి.. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించేలా తీర్చిదిద్దుతున్న పీఈటీ, పీడీలకు ఒక్క అవార్డు కూడా ఇవ్వకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. తమ ఆవేదనను బహిరంగంగా వ్యక్తపరుస్తూ, కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు జాబితాను పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసిన విషయం విదితమే. మొత్తం 79 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా.. వీరికి సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అవార్డులను అందజేయనున్నారు. ఇందులో ఒక్క వ్యాయామ ఉపాధ్యాయుడు కూడా లేకపోవడాన్ని ఏపీ పీఈటీ, ఎస్‌ఏపీఈ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.
12 వేల మందిలో ఒక్కరూ లేరా..?
రాష్ట్రంలో ఉన్న పాఠశాలల్లో అన్ని మేనేజ్‌మెంట్‌లు కలిపి సుమారు 12 వేల మంది వ్యాయామ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వీరిలో ఒక్క వ్యాయామ ఉపాధ్యాయునికి కూడా ఉత్తమ అవార్డుకు ఎంపిక చేయలేదు. ఇది తీవ్రంగా బాధిస్తోందని పీడీలు వాపోతున్నారు. ఇది క్రీడల పట్ల వివక్షగా భావించవచ్చా? అని ప్రశ్నిస్తున్నారు. నేడు క్రీడా రంగంలో పాఠశాల స్థాయిలోనే వివిధ పోటీల్లో బంగారు, రజత, కాంస్య పతకాలు విద్యార్థులు సాధిస్తున్నారంటే అది ఎవరి కారణంగానో ప్రభుత్వం గుర్తించలేకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థి దశలో ఏ క్రీడకు ఎవరు సరిపోతారో అని పరీక్షించి, ఫండమెంటల్ రూల్స్ నేర్పించి క్రీడాకారుని భవిష్యత్‌కు పునాదులు వేసేది ఈ వ్యాయామ ఉపాధ్యాయుడు కాదా..? అని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ, క్రీడలలో తర్ఫీదుతో పాటు.. పాఠశాలలో జరిగే ప్రతీ కార్యక్రమాన్ని తన భుజస్కందాలపై వేసుకొని అహర్నిశలు వ్యాయామ ఉపాధ్యాయులు కష్టపడుతున్నారని చెబుతున్నారు.
● జిల్లా స్థాయిలో ఏ కార్యక్రమం జరిగినా.. సైన్స్‌ఫేర్, బదిలీల కౌన్సిలింగ్, జాతీయ పండుగలకు.. ఇలా అన్నింట్లోనూ పీఈటీ, పీడీ సేవలను వినియోగించుకుని.. అవార్డులకు మాత్రం తాము అర్హులం కాకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు వాపోతున్నారు. స్కూల్ అసిస్టెంట్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మాథ్స్, సైన్స్, సోషల్‌కు 10వ తరగతి మార్కుల ఆధారంగా అవార్డులు ఇస్తున్నారు... పీఈటీ, ఎస్‌ఏ పీఈలకు, ఎస్జీఎఫ్‌కు సంబంధించి సర్టిఫికెట్‌లను ఎందుకు పరిగణనలోకి తీసుకోరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడలలో రాష్ట్రానికి పతకాలు కావాలి.. ఆ క్రీడలలో తర్ఫీదు ఇచ్చే పీఈటీ, ఎస్‌ఏపీఈలకు గుర్తింపు అవసరం లేదా? అని ఏపీ పీఈటీ, ఎస్‌ఏపీఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ప్రవీణ్ కిరణ్ ప్రశ్నించారు.
వ్యాయామ ఉపాధ్యాయులకు ‘లీప్’తో ఎలా?
లీప్ యాప్ ప్రామాణికంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసింది. నిత్యం తరగతి గదుల్లో ఉండే ఉపాధ్యాయులకు అది సాధ్యపడుతుంది. ఆటలు, ఇతర కార్యక్రమాలతో నెలలో సగం రోజులకు పైగా పీఈటీ, పీడీలు బయట ప్రాంతాల్లోనే ఉంటారని.. అటువంటిది లీప్ యాప్ ఎలా వినియోగించగలరని పార్వతీపురం మన్యం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం చెబుతోంది. అధికారులు ఆ మాత్రం కూడా గ్రహించలేరా అని సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. లీప్ యాప్‌లో అన్నీ బాగుండి.. వారు పాఠశాలల్లో ఏమీ చెప్పకపోయినా ఫర్వాలేదా అని అంటున్నారు. ‘రాష్ట్ర, జాతీయ స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన కోటా లేదు. అందువల్లే ప్రతి సారీ మాకు నష్టం జరుగుతోంద‘ని మన్యం జిల్లాకు చెందిన ఓ వ్యాయామ ఉపాధ్యాయుడు వాసు ‘సాక్షి’కి తెలిపారు. ఇదే విధానం కొనసాగితే.. తన ఉద్యోగ జీవితంలో అవార్డు అందుకోవడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఉత్తమ ఉపాధ్యాయుల్లో ఒక్కరూ లేరా?
క్రీడలు అంటే ప్రభుత్వానికి అలుసా..
ఉత్తమ ఉపాధ్యాయులుగా తమను
ఎంపిక చేయకపోవడంపై ఆవేదన
చెందుతున్న పీఈటీ, పీడీలు


