● రాజాంలో రెండురోజుల క్రితం ఆవులు పట్టుకున్న అధికారులు
● ఫైన్ పేరుతో రైతుల వద్ద వసూళ్లు
రాజాం: పట్టణంలోని ప్రధాన రహదారిపై విచ్చలవిడిగా సంచరిస్తున్న గోవులను రెండురోజులు క్రితం మున్సిపల్ కమిషనర్ ఎ.రామచంద్రరావు, రాజాం పట్టణ సీఐ డి.నవీన్‌కుమార్‌లు పట్టుకున్న విషయం పాఠకులకు విదితమే. వాటిని సింహాచలం గోశాలకు తరలిస్తున్నట్లు అధికారులు పట్టుకున్న సమయంలో వెల్లడించారు. ఈ ఘటన జరిగి రెండురోజులు గడిచినా ఈ ఆవులను గోశాలకు తరలించకుండా పట్టణానికి దగ్గరలో ఉన్న మర్రివలస గ్రామంలో ఓచోట దాచిపెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది ఆవుల యజమానులు తమ గోవులను తమకు అప్పగించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయానికి రాగా, గోశాలకు పంపించేశామని మున్సిపల్ సిబ్బంది చెప్పడంతో రైతులు సింహాచలం గోశాల వివరాలు తీసుకుని ఆరాతీశారు. అక్కడికి ఆవులు రాలేదని తెలియడంతో ఇక్కడ వెతకడం ప్రారంభించారు. చివరకు రాజాం సమీపంలో శ్రీకాకుళం రోడ్డులోని మర్రివలసలో ఓ రైతు కళ్లంలో ఆవులు ఉన్నాయని తెలిసి అక్కడికి వెళ్లి తమ ఆవులను వెనక్కు తీసుకొచ్చే ప్రయత్నం చేయగా, ఆ రైతుల నుంచి మున్సిపల్ సిబ్బంది అపరాధ రుసుం వసూలు చేయడం ప్రారంభించారు. ఒక్కో ఆవుకు రూ.4వేల నుంచి రూ. 5 వేలు వసూలు చేయడంతో ఆగ్రహించిన రైతులు తమ గోడును బయటపెట్టారు. దీంతో ఈ విషయం శుక్రవారం పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది. గోశాలకు పంపిస్తున్నామని చెప్పిన ఆవులను స్థానికంగా దాచిపెట్టడం వెనుక ఏదో మతలబు ఉందని, రైతుల వద్ద అపరాధ రుసుం పేరుతో వసూలు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నల వర్షం కురిపించారు.
సింహాచలం గోశాలలో ఖాళీ లేకనే..
ఇదిలా ఉండగా ఈ విమర్శలపై కమిషనర్ రామచంద్రరావు వెంటనే స్పందించారు. రెండురోజుల క్రితం 35 గోవులను పట్టుకున్నామని వాటిలో 30 గోవులను మాత్రమే లారీకి ఎక్కించామని, మిగిలిన ఐదు ఆవులను లోకల్‌గా విడిచిపెట్టామని తెలిపారు. ఈ 30 ఆవులను సింహాచలం గోశాలకు తరలించేందుకు ఏర్పాటుచేయగా, అక్కడ ఖాళీ లేదని అధికారులు చెప్పడంతో మర్రివలసలో వాటిని భద్రపరిచి, రాజాంలో గోశాల ఏర్పాటుకు ఉన్నతాధికారుల ఆమోదం తీసుకుంటున్నామని చెప్పారు. ఈలోగా ఇక్కడ ఆవులు ఉన్న విషయం తెలుసుకున్న రైతులు తమ గోవులు ఇచ్చేయాలని కోరగా, అపరాధ రుసుం విధించామని, 18 ఆవులకు సంబంధించి రూ.53 వేలు వచ్చాయని, 12 గోవులు భద్రంగానే ఉన్నాయని కమిషనర్ అన్నారు. వాటికి సంబంధించి రైతులకు కంప్యూటరైజ్డ్ రశీదులు ఇస్తున్నామని వివరించారు. రైతులకు ఫైన్ వేయకుంటే మళ్లీ ఆవులను రోడ్డుమీదకు వదిలేస్తారని, స్థానిక ఎమ్మెల్యే సలహా మేరకే ఈ నిర్ణయాలు తీసుకున్నామన్నారు. గోవుల నిమిత్తం వెళ్లిన రైతుల్లో మీసాల రూప, బంకి పాపినాయుడు తదితరులు మాట్లాడుతూ తమ వద్ద బలవంతంగా ఒక్కో ఆవుకు రూ.4 వేలు మించి వసూలు చేశారని ఆరోపించారు.


