సాలూరు/గుర్ల: సాలూరు మండలం కొదమ పంచాయతీ లొద్ద జలపాతం రోడ్డు సమీపంలో శుక్రవారం జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఓ డ్రైవర్ మృతిచెందగా, ఇద్దరు గాయపడ్డారు. సాలూరు రూరల్ ఎస్‌ఐ రవీంద్రరాజు తెలిపిన వివరాల ప్రకారం... లొద్ద జలపాతం రోడ్డు పనుల నేపథ్యంలో ఓ కంటైనర్ అక్కడ ఉండిపోయింది. ఆ కంటైనర్‌ను లారీపై తీసుకెళ్లేందుకు విజయనగరం జిల్లా గుర్లకు చెందిన డ్రైవర్ మొయిద ఆనందరావు (50), కంకణాల ఈశ్వరరావు(సంతోష్), గంట్యాడ మండలం లక్కిడాంకు చెందిన సంగం వెంకటరావు అక్కడికి చేరుకున్నారు. కంటైనర్‌ను తరలించేందుకు సాలూరు నుంచి క్రేన్, బొబ్బిలి నుంచి ట్రాలీని తీసుకువచ్చారు. క్రేన్ సహాయంతో కంటైనర్‌ను ఎత్తి ట్రాలీపై ఉంచే ప్రయత్నం చేస్తున్న సమయంలో అక్కడి ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలను క్రేన్ తాకింది. అంతే.. కంటైనర్‌కు విద్యుత్ సరఫరా కావడంతో కంటైనర్‌ను చేతులతో పట్టుకున్న ముగ్గురిలో కంకణాల ఈశ్వరరావు, సంగం వెంకటరావు గాయాలతో బయటపడగా, ఆనందరావు విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం, మృతుడుని పోస్టుమార్టం కోసం సాలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య మొయిద శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలిసులు కేసు నమోదుచేశారు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె సాయి ప్రశాంతి ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తుండగా, సుస్మిత డిగ్రీ, అనూష ఇంటర్మీడియట్ చదువుతున్నారు. మృతుడి తండ్రి అప్పారావు వ్యవసాయ పనులు చేస్తుంటాడు. ఇంటిపెద్ద మృతిచెందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


